చిలమత్తూరు: మండలంలోని 44వ నంబరు జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వడ్డిచెన్నంపల్లికి చెందిన వినయ్ కుమార్ (22) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. జాతీయ రహదారి పక్కనే ఉన్న పంజాబీ డాబా వద్ద శనివారం కోడూరు తోపు నుంచి వినయ్‌కుమార్ మరో యువకుడితో పాటు చెక్‌పోస్ట్ వైపునకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. దేమకేతేపల్లికి చెందిన గొల్ల రాధాకృష్ణ రాంగ్ రూట్‌లో వచ్చి ఢీకొట్టాడు. ప్రమాదంలో వినయ్ కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. మరో యువకుడికి స్వల్ప గాయాలయ్యాయి. వీరిని బాగేపల్లి ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గంమధ్యలో వినయ్ మృతి చెందగా, మరో ద్విచక్ర వాహనదారుడు రాధాకృష్ణకు గాయాలు కాగా హిందూపురం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
త్రుటిలో తప్పిన పెనుప్రమాదం
చిలమత్తూరు: మండలంలోని 44వ నంబరు జాతీయ రహదారి థామస్ మన్రోతోపు సమీపంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మూడు వాహనాలు ఒకేసారి ఢీకొన్నాయి. స్థానికుల సమాచారం మేరకు బెంగళూరు వైపు నుంచి ఆర్మీ వాహనం థామస్ మన్రో తోపు కుషావతి నదిపై కట్టిన బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన స్పీడు బ్రేకర్ల వద్ద వేగం తగ్గించింది. వెనుకవైపు నుంచి వేగంగా వచ్చిన కంటైనర్ వాహనం ఆర్మీ వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. దాని వెనుక వచ్చిన మరో లారీ కంటైనర్ వాహనాన్ని ఢీకొట్టింది.అయితే ప్రమాద సమయంలో వాహనాలు నదిలో పడలేదు. దీంతో త్రుటిలో పెనుప్రమాదం తప్పింది. ప్రమాదంలో కంటైనర్, లారీ డ్రైవర్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
ఎనిమిది మంది రౌడీషీటర్ల బైండోవర్
ధర్మవరం అర్బన్: పట్టణంలో ఎనిమిది మంది రౌడీషీటర్లను బైండోవర్ చేసి రూ.5 లక్షల పూచీకత్తుతో వదిలివేసినట్లు వన్ టౌన్ సీఐ రెడ్డెప్ప తెలిపారు. శనివారం పట్టణంలోని ఎరగుంట వార్డుకు చెందిన ఎనిమిది మంది రౌడీషీటర్లు, అనుమానిత వ్యక్తులను తహసీల్దార్ కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ దేవరాజ్ ముందు బైండోవర్ చేశారు. ఒక్కొక్కరు రూ.5 లక్షల పూచీకత్తు బాండ్లు సమర్పించారు.
నీట్ పీజీ ప్రవేశపరీక్షలో
శర్వాణికి మొదటి ర్యాంకు
మడకశిర: పట్టణానికి చెందిన శర్వాణి అనే విద్యార్థిని డెంటల్ పీజీలో ప్రవేశానికి నిర్వహించిన నీట్ పరీక్షలో అత్యంత ప్రతిభను కనబరిచింది. ఆర్యవైశ్య వర్గానికి చెందిన ఎంసీ నాగరాజు కుమార్తె అయిన శర్వాణి 2026–27 డెంటల్ పీజీలో ప్రవేశానికి నిర్వహించిన నీట్ పరీక్షలో దేశ స్థాయిలో 54వ ర్యాంక్ సాధించింది. అదేవిధంగా రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంక్ సాధించి మడకశిర నియోజకవర్గానికి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చింది. గత మే నెలలో డెంటల్ పీజీలో ప్రవేశానికి దేశ వ్యాప్తంగా నీట్ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. శర్వాణి మాట్లాడుతూ తల్లిదండ్రులు, అధ్యాపకులు, ప్రొఫెసర్ల ప్రోత్సాహంతోనే తాను ఈ ఘనత సాధించానని తెలిపారు. దేశస్థాయిలో 54వ ర్యాంక్, రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంక్ రావడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఆమె తండ్రి నాగరాజు మాట్లాడుతూ కష్టానికి ఫలితం దక్కిందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. శర్వాణికి ఆర్యవైశ్య సంఘం నాయకులు, వ్యాపారులు, ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు.


