పుట్టపర్తి అర్బన్: పెడపల్లిపెద్ద తండాలో మహిళ అప్రమత్తమై దుండుగలను అడ్డుకోవడంతో చోరీకి విఫలయత్నం అయ్యింది. బాధిత మహిళ, స్థానిక పోలీసులు తెలిపిన మేరకు.. పెడపల్లి పెద్ద తండాకు శ్రీరామ్ నాయక్ గొర్రెల కాపరి కావడంతో శుక్రవారం రాత్రి మంద వద్దకు వెళ్లాడు. ఇదే అదునుగా చూసుకొని గ్రామానికి చెందిన హనుమానాయక్ కుమారుడు జశ్వంత్‌నాయక్, ఎరుకుల గిరి మరికొందరితో కలిసి శుక్రవారం అర్ధరాత్రి ఇందిరబాయి ఇంటికి దొంగతనానికి వెళ్లారు. ఇంటికి గేటు తీస్తున్న సమయంలో శబ్దం రావడంతో ఇందిరాబాయి మేల్కొని, దొంగలొచ్చారని పసిగట్టింది. వెంటనే అప్రమత్తమై గట్టిగా కేకలు వేసి, వీధిలోనివారిని పిలుస్తూ ఇంటిబయటకు వచ్చింది. అప్పటికే గంజాయి మత్తులో ఉన్న ఇద్దరు దుండగులు మిద్దపైకెక్కి పొరుగున ఉన్న మిద్దైపె చేరుకున్నారు. స్థానికులు అక్కడికి చేరుకొని ఇద్దరిని పట్టుకున్నారు. దుండగుల్లో ఒకడైన జశ్వంత్ నాయక్ తప్పించుకొని పరారయ్యాడు. గిరిని పట్టుకొని బస్టాండ్ వద్ద దేహశుద్ధి చేసి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పుట్టపర్తి రూరల్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తీసుకెళ్లారు.
కరువు ప్రాంత ప్రజలను ఆదుకోండి
బత్తలపల్లి: వర్షాభావంతో కరువు కోరల్లో చిక్కుకున్న రైతులు, ప్రజలను ఆదుకోవాలని ఓపీడీఆర్ ఉమ్మడి అనంతపురం జిల్లా అధ్యక్షుడు ఆర్.రామ్‌కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాయకుంట్ల శ్రీనివాసులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం బత్తలపల్లి, రాఘవంపల్లి, పోట్లమర్రి గ్రామాల్లో జలసాధన సమితి ఆధ్వర్యంలో రైతుల కలిసి పర్యటించారు. పంట పొలాలను, పండ్ల తోటలను, ఎండిపోయిన పంటలు పరిశీలించారు. ఈ ఏడాది వర్షాలు కురవక పంటలు, పండ్లతోటలు ఎండుముఖం పట్టాయని, తాగునీరు దొరకని పరిస్థితి అన్నారు. తక్షణ ప్రాధాన్యతగా ఆత్మకూరు మండలం పంపనూరు వద్ద హంద్రీ నీవా కాలువకు, పీఏబీఆర్ అప్పరాచెరువు లింక్ కెనాల్‌కు అనుసంధానం చేయాలన్నారు. హంద్రీ–నీవా నుంచి నీరు మళ్లించాలని, సీబీఆర్ నుంచి తాడిమర్రి, బత్తలపల్లి మండలంలోని చెరువులు నింపేందుకు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలన్నారు. పీఏబీఆర్ రైట్ కెనాల్ ఆయకట్టు, దిగువ ప్రాంతం అయిన బత్తలపల్లి, తాడిమర్రి ప్రాంతాలకు మూడేళ్లుగా నీరు ఇవ్వలేదన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయ అధికారులకు వినతి పత్రం అందజేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేంద్ర, సహాయ కార్యదర్శి జీసీ ప్రకాష్, ఏపీ రైతు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కమతం కాటమయ్య, శ్రీసత్యసాయి కార్మిక నీటి సంఘం సభ్యులు జగన్ మారుతి, భాషా, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.


