ప్రశాంతి నిలయం: జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలోని రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న రెవెన్యూ భవన్‌లో సోమవారం జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శ్యాంప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే డివిజన్, మండల కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాల్లో కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదికలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. రెవెన్యూభవన్‌కు రాకుండా కూడా మీకోసం.ఏపీ.జీఓవీ.ఇన్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
పోలీస్ కార్యాలయంలోనూ..
పుట్టపర్తి టౌన్: పుట్టపర్తి పోలీస్ కార్యాలయంలోని వీడియో కాన్సరెన్స్ హాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్పీ సతీష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా అర్జీల ద్వారా తెలుపుకోవాలని సూచించారు. అర్జీదారులు కచ్చితంగా తమ ఆధార్‌కార్డు వెంట తీసుకురావాలన్నారు.
నీట్–పీజీ పరీక్షా కేంద్రం
పరిశీలన
పుట్టపర్తి అర్బన్: పుట్టపర్తి సమీపంలోని సంస్కృతీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో ఆదివారం జరిగిన నీట్–పీజీ కంప్యూటర్ ఆధారిత పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ శ్యాంప్రసాద్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భద్రతా ఏర్పాట్లు, కంప్యూటర్లు, ఇంటర్‌నెట్ కనెక్టివిటీని పరిశీలించారు. పరీక్షా కేంద్రంలో వంద మంది అభ్యర్థులకుగాను 96 మంది హాజరైనట్లు అధికారులకు కలెక్టర్‌కు తెలిపారు. పరీక్ష ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకూ జరిగింది. ఆయన వెంట సీఐ యువరాజ్, తహసీల్దార్ సంహిత తదితరులు పాల్గొన్నారు.
ఖాద్రీశుడి సేవలో
దేవదాయశాఖ కమిషనర్
కదిరి టౌన్: ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని దేవదాయశాఖ కమిషనర్ చంద్రశేఖర్ అజాద్ ఆదివారం దర్శించుకున్నారు. ఆలయం వద్దకు రాగానే అర్చకులు పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఆలయ విశిష్టతను వివరించారు. అనంతరం కమిషనర్‌ను శాలువాతో పాటు పుష్పగుచ్ఛాలతో సన్మానించారు. తీర్థప్రసాదాలు అందజేసి స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు అంజన్‌కుమార్‌స్వామి, శీనా స్వామి , ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
రసాయనాల
నమూనాల సేకరణ
చిలమత్తూరు: హిందూపురం రూరల్ మండల పరిధిలోని తూముకుంట, గొల్లాపురం పారిశ్రామికవాడలో ఫార్మా కంపెనీలు బహిరంగ ప్రదేశాల్లో రసాయనాలు వదులుతూ పర్యావరణాన్ని విషతుల్యం చేస్తున్న విషయంపై ‘‘ఫార్మా.. ప్రజలకు ఇదేమి ఖర్మ’’ శీర్షికన ఆదివారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనికి స్పందించిన కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పీకే స్టీల్ పరిశ్రమ రెండో గేటు వద్ద ఉన్న రైల్వే బ్రిడ్జి కింద ఉన్న రసాయన నమూనాలను సేకరించారు. ఈ మేరకు పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు. అయితే యథావిధిగా ప్రతిసారి శ్యాంపిల్స్ సేకరించడం, వాటి నివేదికలను బయటకు చెప్పకపోవడం పీసీబీ అధికారులకు అలవాటైపోయిందంటూ ప్రజలు విమర్శిస్తున్నారు.


