సమస్యలు ప్రాథమిక దశలోనే పరిష్కరించుకోండి | - | Sakshi
Sakshi News home page

సమస్యలు ప్రాథమిక దశలోనే పరిష్కరించుకోండి

Aug 30 2026 1:45 AM | Updated on Aug 30 2026 1:45 AM

ధర్మవరం అర్బన్‌: కుటుంబ సమస్యలు ప్రాథమిక దశలోనే సామరస్యంగా పరిష్కరించుకోవాలని జిల్లా అడిషనల్‌ ఎస్పీ అంకిత సురాన తెలిపారు. స్థానిక వన్‌ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ సెంటర్‌ను జిల్లా అడిషనల్‌ ఎస్పీ అంకిత సురాన పరిశీలించారు. ఫ్యామిలీ కౌన్సెలింగ్‌కు వచ్చిన దంపతులను అడిషనల్‌ ఎస్పీ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కుటుంబ సమస్యలు, దాంపత్య వివాదాలు, అపార్థాలను సామరస్య పూర్వకంగా పరిష్కరించి కుటుంబాల్లో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పడమే ఫ్యామిలీ కౌన్సిలింగ్‌ సెంటర్ల ప్రధాన ఉద్దేశమన్నారు. విడిపోయిన కుటుంబాలను తిరిగి కలపడంలో ఫ్యామిలీ కౌన్సిలింగ్‌ సెంటర్లు అందిస్తున్న సేవలు అభినందనీయమని తెలిపారు. ఇరుపక్షాల అభిప్రాయాలను పూర్తిగా తెలుసుకుని పరిస్థితులకు అనుగుణంగా కౌన్సిలింగ్‌ అందించడం ద్వారా అనేక సమస్యలకు పరిష్కారం చూపవచ్చని తెలిపారు. జిల్లాలోని అన్ని సబ్‌ డివిజన్లలో జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ సెంటర్ల ద్వారా విడిపోయిన కుటుంబాలను తిరిగి ఒక్కటి చేస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నామన్నారు. ప్రజలు కుటుంబ సమస్యలను ఎలాంటి సంకోచం లేకుండా కౌన్సిలింగ్‌ సెంటర్‌ సిబ్బందితో పంచుకోవాలని అవసరమైన మార్గదర్శకత్వం అందించేందుకు పోలీస్‌శాఖ ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటుందన్నారు. ఫిర్యాదుదారుల సమస్యలను సున్నితంగా ఓర్పుతో విని వారికి తగిన సహకారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ జగన్నాథరాజు, సీఐలు రెడ్డెప్ప, జయనాయక్‌, ఫ్యామిలీ కౌన్సిలింగ్‌ సెంటర్‌ ప్రతినిధులు బాలసుందరి, భార్గవి, చలపతి, గంగాభవాని, రాఘవేంద్ర, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ఉన్నత లక్ష్యం నిర్దేశించుకోవాలి

బత్తలపల్లి: విద్యార్థులు జీవితంలో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని అడిషనల్‌ ఎస్పీ అంకిత సురాన పేర్కొన్నారు. శనివారం మండలంలోని ఈదుల ముష్టూరులో మహిళలు, బాలబాలికల భద్రత, చట్టాలు, సైబర్‌ నేరాలు, బాల్యవివాహాలు, సోషల్‌ మీడియా వినియోగంపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. అడిషనల్‌ ఎస్పీతో పాటు ధర్మవరం డీఎస్పీ జగన్నాథరావు హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ మహిళలు, బాలికల భద్రత కోసం శక్తి యాప్‌ సేవలను వినియోగించుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్‌ 112, మహిళల సహాయం కోసం 181, సైబర్‌ నేరాలపై ఫిర్యాదుల కోసం సైబర్‌ క్రైమ్‌ సేవలు వినియోగించుకోవాలన్నారు. సీఐ ప్రభాకర్‌గౌడు, ఎస్‌ఐ సోమశేఖర్‌యాదవ్‌, హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు, ఐసీడీఎస్‌ సిబ్బంది, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement