ప్రశాంతి నిలయం: నూతన డీఆర్‌ఓ కొండయ్య మంగళవారం కలెక్టరేట్‌లో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మర్యాద పూర్వకంగా కలెక్టర్ శ్యాంప్రసాద్, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, ఇతర అధికారులను కలిశారు. ఈ సందర్భంగా డీఆర్‌ఓ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. రెవెన్యూ పరంగా మెరుగైన సేవలు అందిస్తామని, సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందజేలా ప్రభుత్వ యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతామన్నారు.
15న పుట్టపర్తికి
కేంద్ర మంత్రి రాక
పుట్టపర్తి అర్బన్: కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, సీఎం చంద్రబాబు ఈనెల 15న పుట్టపర్తికి రానున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లిలో యుద్ధ విమానాల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో సభా స్థలాన్ని కలెక్టర్ శ్యాంప్రసాద్, జేసీ మౌర్య భరద్వాజ్ తదితరులు మంగళవారం పరిశీలించారు. సభా వేదిక, అవసరమైన ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. వేదికతో పాటు ప్రజలు కూర్చునే సదుపాయాలు, తాగునీరు, పారిశుధ్యం, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలపై సమీక్షించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. విద్యుత్, వైద్య సదుపాయాలు, అగ్నిమాపక ఏర్పాట్లు సిద్ధంగా ఉంచాలన్నారు. కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించండి
● డీఈఓ కిష్టప్ప
పుట్టపర్తి: పిల్లల భవిష్యత్‌కు ప్రభుత్వ పాఠశాలలే పునాది అని డీఈఓ కిష్టప్ప పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి విద్యాశాఖ ఆధ్వర్యంలో వాహన ర్యాలీని మంగళవారం ప్రారంభించారు. కొత్తచెరువులోని డీఈఓ కార్యాలయంలో ఉపాధ్యాయులతో కలిసి డీఈఓ వాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం డీఈఓ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు ఉంటారని, ఉచిత బోధన అందిస్తామన్నారు. అలాగే విద్యార్థి మిత్ర కిట్‌లో యూనిఫారం, పుస్తకాలు, స్కూల బ్యాగ్, షూ అందిస్తారని పేర్కొన్నారు. మధ్యాహ్న భోజనం నాణ్యంగా అందిస్తారని, అలాగే రాగిజావ, కోడిగుడ్లు చిక్కీలు పంపిణీ చేస్తారన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని కోరారు.
టన్ను మామిడి రూ.44 వేలు
అనంతపురం అగ్రికల్చర్: అనంతపురంలోని కక్కలపల్లి మార్కెట్‌లో మంగళవారం టన్ను మామిడి కాయలు గరిష్టంగా రూ.44 వేలు పలికినట్లు రాప్తాడు మార్కెట్ కమిటీ సెక్రటరీ రూప్‌కుమార్ తెలిపారు. మార్కెట్‌కు 260 టన్నుల మామిడికాయలు అమ్మకానికి రాగా, వాటిని బహిరంగ వేలం వేశారన్నారు. అందులో హిమాయత్ రకం మామిడి టన్ను గరిష్టంగా రూ.44 వేలు, కనిష్టంగా రూ.20 వేలు, సరాసరిన రూ.30 వేల ప్రకారం ధర పలికాయన్నారు. అలాగే బేనీషా రకం మామిడి టన్ను గరిష్టంగా రూ.41 వేలు, కనిష్టంగా రూ.15 వేలు, సరాసరిన రూ.28 వేలు కాగా పలికాయని వివరించారు. ఇక మల్లికా రకం మామిడికాయలు టన్ను గరిష్టంగా రూ.35 వేలు, కనిష్టంగా రూ.10 వేలు, సరాసరిన రూ.20 వేల ప్రకారం క్రయ విక్రయాలు జరిగినట్లు మార్కెట్ కమిటీ సెక్రటరీ వెల్లడించారు.


