యానిమేటర్‌ భర్త ఘరానా మోసం | - | Sakshi
Sakshi News home page

యానిమేటర్‌ భర్త ఘరానా మోసం

May 13 2026 1:38 AM | Updated on May 13 2026 1:38 AM

బ్రహ్మసముద్రం: ఓ యానిమేటర్‌ భర్త ఘరానా మోసానికి పాల్పడిన విషయం మండలవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని ఎర్ర కొండాపురం గ్రామంలో 16 డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. యానిమేటర్‌గా గ్రామానికి చెందిన అంజలి ఉన్నా ఆమె భర్త, టీడీపీ కార్యకర్త శ్రీకాంత్‌ అన్నీ తానై వ్యవహరిస్తున్నాడు. 8 సంఘాలకు చెందిన రూ.3 లక్షలకుపైగా పొదుపు సొమ్మును తన తల్లి తిమ్మక్క, భార్య అంజలి ఖాతాల్లో వేసుకున్నాడు. మంగళవారం గ్రామానికి చెందిన పలువురు మహిళలు తమ సంఘాలకు సంబంధించి లావాదేవీలపై వేపులపర్తి యూనియన్‌ బ్యాంక్‌లో ఆరా తీయగా శ్రీకాంత్‌ బాగోతం వెలుగుచూసింది. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసేందుకు బాధిత మహిళలు బ్రహ్మసముద్రం వెలుగు కార్యాలయానికి వెళ్లారు. కార్యాలయంలో అధికారులు లేకపోవడంతో నిరసన తెలియజేశారు. తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.

పెళ్లి ఇష్టం లేక యువతి ఆత్మహత్య

కళ్యాణదుర్గం రూరల్‌: పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన కళ్యాణదుర్గం పట్టణంలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు... ఉరవకొండకు చెందిన మోహన్‌, లలితమ్మ దంపతుల కుమార్తె రేవతి (21)ని ఆమె చిన్నతనంలోనే కళ్యాణదుర్గంకు చెందిన వారి బంధువు శకుంతల దత్తత తీసుకుంది. డిగ్రీ వరకూ చదివించింది. రేవతికి ఇంకా చదవాలనే కోరిక ఉండేది. కుటుంబ సభ్యులకు ఆర్థిక స్థోమత లేకపోవడంతో పెళ్లి సంబంధాలు చూడడం ప్రారంభించారు. దీంతో మనస్తాపం చెందిన రేవతి మంగళవారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక సీహెచ్‌సీకి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధరించారు.

అభయాంజనేయుడికి వెండి కవచం వితరణ

గుంతకల్లుటౌన్‌: హనుమాన్‌ సర్కిల్‌లో ఉన్న అభయాంజనేయస్వామి మూలవిరాట్‌కు 3 కేజీల వెండి కవచాన్ని దాతలు వితరణ చేశారు. మంగ ళవారం హనుమాన్‌ జయంతిని పురస్కరించుకుని బెల్డోన స్వామి ఆధ్వర్యంలో పట్టణానికి చెందిన గౌరీలక్ష్మి, కుమారులు పవన్‌కుమార్‌, రవికుమార్‌, ఆదినారాయణలు వెండి కవచాన్ని అర్చకుడికి అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement