డిజిటైడ్‌లో ఉద్యోగావకాశాలు | - | Sakshi
Sakshi News home page

డిజిటైడ్‌లో ఉద్యోగావకాశాలు

May 13 2026 1:38 AM | Updated on May 13 2026 1:38 AM

పుట్టపర్తి అర్బన్‌: హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఐటీ సంస్థ డిజిటైడ్‌ పూల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తోందని, అర్హత కలిగిన అభ్యర్థులు సద్విని యోగం చేసుకోవాలని పుట్టపర్తి సంస్కృతీ గ్రూప్‌ ఆఫ్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ చైర్మన్‌ విజయ్‌ భాస్కర్‌రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇంటర్‌, డిగ్రీ, బీటెక్‌ పూర్తి చేసిన అభ్యర్థులు ఈనెల 15న కళాశాలలో సంప్రదించాలన్నారు. ముందస్తుగా 9100974544 ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలన్నారు. అభ్యర్థులు హైదరాబాద్‌లో పని చేయాల్సి ఉంటుందన్నారు. యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు.

నాణ్యతకు ప్రతిరూపం భారతి సిమెంట్‌

ధర్మవరం: నాణ్యత, మన్నికకు ప్రతిరూపం భారతి సిమెంట్‌ అని కంపెనీ టెక్నికల్‌ హెడ్‌ ఓబుళరెడ్డి తెలిపారు. ధర్మవరంలో మంగళవారం భారతి సిమెంట్‌ డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతి సిమెంట్‌ రోబోటిక్‌ టెక్నాలజీతో తయారవుతుందని వివరించారు. అత్యుత్తమ ప్రమాణాలు పాటించి ప్రజల విశ్వాసాన్ని పొందిందన్నారు. కార్యక్రమంలో భారతి సిమెంట్‌ మార్కెటింగ్‌ మేనేజర్‌ ప్రతాప్‌రెడ్డి, టెక్నికల్‌ ఇంజనీర్‌ మోతీలాల్‌నాయక్‌, డీలర్‌ చాంద్‌భాష, పలువురు డీలర్లు పాల్గొన్నారు.

ఆలయంలో చోరీ

కదిరి అర్బన్‌: మండల పరిధిలోని యర్రదొడ్డి గంగమ్మ ఆలయంలో మంగళవారం చోరీ జరిగింది. అమ్మవారి కిరీటం, రెండు గొడుగులను భక్తుని అవతారంలో వచ్చిన దొంగ అపహరించాడు. దుండగుడు కారులో వచ్చి మరీ దొంగ తనం చేయడం గమనార్హం. చోరీ విషయమై రూరల్‌ అప్‌గ్రేడ్‌ పోలీస్టేషన్‌లో సిబ్బంది, అర్చ కులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

బాలుడి మృతదేహం లభ్యం

గుమ్మఘట్ట: మండలంలోని బైరవానితిప్ప ప్రాజెక్టులో అదృశ్యమైన బాలుడి మృతదేహం మంగళవారం లభ్యమైంది. వివరాలిలా ఉన్నాయి.. తాళ్లకెరకు చెందిన మారెన్న, సుమక్క దంపతులకు కుమారుడు ఉమేష్‌ (14), ముగ్గురు కుమార్తెలున్నారు. వారు గొర్రెలు మేపుకుని జీవనం సాగించేవారు. తండ్రికి తోడుగా ఉమేష్‌ గొర్రెలు మేపేందుకు సోమవారం గ్రామ సమీపంలోని బీటీపీ రిజర్వాయర్‌ దగ్గరకు వెళ్లాడు. సాయంత్రం 4 గంటల సమయంలో రిజర్వాయర్‌లోని ఓ గుంతలోకి ఉమేష్‌ ఈతకు వెళ్లాడు. ఈత రాకపోవడంతో నీటిలో మునిగి గల్లంతయ్యాడు. ఆలస్యంగా గమనించిన తండ్రి నీటిలో గాలించినా ఫలితం లేకుండా పోయింది. మంగళవారం మృతదేహాన్ని వెలికితీసిన పోలీసులు కుటుంబసభ్యులకు అందజేశారు. ఒక్కగానొక్క కుమారుడు కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో తల్లిదండ్రుల ఆవేదన వర్ణనాతీతంగా మారింది.

Advertisement
 
Advertisement
Advertisement