వాల్మీకీ ప్రతిభా అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

వాల్మీకీ ప్రతిభా అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

May 13 2026 1:38 AM | Updated on May 13 2026 1:38 AM

ధర్మవరం అర్బన్‌: వాల్మీకీ ప్రతిభా అవార్డులకు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర వాల్మీకి ఉద్యోగుల సంఘం ఆర్థిక కార్యదర్శి ఈశ్వరయ్య, సీనియర్‌ నాయకుడు బీకే ముత్యాలప్ప తెలిపారు. పట్టణంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ పదో తరగతిలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులైతే 450 మార్కులకుపైగా ఉండాలని, ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థులు 500 మార్కులకు పైగా ఉండాలన్నారు. ఇంటర్‌లో ప్రభుత్వ కాలేజీల విద్యార్థులు 750 మార్కులు, ప్రైవేటు కాలేజీల విద్యార్థులు 850 మార్కులు తెచ్చుకున్న వారు అర్హులన్నారు. ఈనెల 20 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్‌కార్డు, మార్కుల పత్రం 9652800038, 9394798674 ఫోన్‌ నంబర్లకు వాట్సాప్‌లో పంపించాలన్నారు. ఈనెల 31న పట్టణంలోని షిరిడీ సాయిబాబా కల్యాణ మండపంలో ప్రతిభా అవార్డులు అందిస్తామని తెలిపారు. సమావేశంలో వాల్మీకీ ఉద్యోగుల సంఘం నాయకులు రామకృష్ణ, జెన్నే నాగప్ప, నరసింహులు, చంద్రశేఖర్‌, నాగరాజు, వెంకటేష్‌, శివయ్య, పోతలయ్య పాల్గొన్నారు.

విమానయానం.. ఆదర్శం

లేపాక్షి: ఆ టీచర్‌ దంపతులు ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఆదర్శంగా నిలిచారు. అందరి ప్రశంసలు అందుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కొండూరు ఉన్నత పాఠశాల హెచ్‌ఎం శేషగిరిబాబు తమ పాఠశాలలో పదో తరగతిలో 550 పైన మార్కులు సాధించే విద్యార్థులకు విమాన ప్రయాణం చేయిస్తానని గతంలో మాట ఇచ్చారు. అదేవిధంగా శేషగిరిబాబు భార్య బయాలజీ సైన్సు టీచర్‌ టీఎన్‌ మాధవి తాను పనిచేసే చిలమత్తూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థికి విమాన ప్రయాణం చేయిస్తానని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం భార్యాభర్తలు తమ తమ పాఠశాలల్లో అత్యధిక మార్కులు సాధించిన కే.నాని(574 మార్కులు), ఎం.సుప్రజ (589 మార్కులు)ను మంగళవారం హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకి విమానంలో తీసుకెళ్లారు. విమానయానంతో విద్యార్థులను ప్రోత్సహించడం గొప్ప విషయ మని పలువురు వారిని అభినందించారు.

వ్యక్తి బలవన్మరణం

గుంతకల్లు టౌన్‌: కుటుంబ కలహాల కారణంగా పట్టణంలోని మోమినాబాద్‌కు చెందిన కె.రవికుమార్‌ (36) మున్సిపల్‌ పాత ఎస్‌ఎస్‌ ట్యాంక్‌లో పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వన్‌టౌన్‌ పోలీసులు తెలిపిన మేరకు... మెయిన్‌రోడ్డు మున్సిపల్‌ ఆఫీసు ఎదురుగా తోపుడు బండిని ఏర్పాటు చేసుకుని బొప్పాయికాయలను విక్రయిస్తూ జీవనాన్ని సాగిస్తున్న రవికుమార్‌కు భార్య సంధ్య, ఐదుగురు పిల్లలున్నారు. 9వ తేదీ (శనివారం) భార్యతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయిన రవికుమార్‌ మంగళవారం ఉదయం పాత రిజర్వాయర్‌లో శవమై తేలాడు. మున్సిపల్‌ వాటర్‌ వర్క్స్‌ సిబ్బంది నీటిలో తేలియాడుతున్న మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారమివ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని బయటకు తీయించి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మనోహర్‌ తెలియజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement