హిందూపురం: వైఎస్సార్ సీపీ సానుభూతిపరుడు కావడంతో ఓ దివ్యాంగ డీలర్‌పై టీడీపీ నాయకులు కక్ష కట్టారు. హైకోర్టు నుంచి బాధితుడు ఉత్తర్వులు తెచ్చుకున్నా వేధింపులు మాత్రం ఆగడం లేదు. వివరాలిలా ఉన్నాయి.. హిందూపురం మండలం కగ్గల్లు ఎఫ్‌పీ షాపు డీలర్ పొట్టి ఆదినారాయణప్ప 18 ఏళ్లుగా డీలర్‌గా పనిచేస్తున్నాడు. ఇతను వైఎస్సార్ సీపీ సానుభూతిపరుడు. దీంతో రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడగానే స్థానిక టీడీపీ నాయకులు ఇతనిపై కక్ష కట్టారు. రెండేళ్ల క్రితం అక్రమంగా డీలర్‌షిప్ తొలగించారు. దీనిపై బాధితుడు హైకోర్టుకు వెళ్లాడు. తన దయనీయ పరిస్థితిని కోర్టుకు తెలిపి డీలర్‌షిప్‌నకు తిరిగి అనుమతి తెచ్చుకున్నాడు. అయినప్పటికీ అధికార పార్టీ నాయకుల వేధింపులు ఆగలేదు. గత జనవరిలో మళ్లీ డీలర్ షిప్ తొలగించడంతో తనకు జరిగిన అన్యాయంపై ఆదినారాయణ మళ్లీ హైకోర్టును ఆశ్రయించాడు. కోర్టు అతని దీన పరిస్థితిని చూసి డీలర్‌గా కొనసాగించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో మే 1 నుంచి 3 వరకు బియ్యం వేయడానికి అనుమతి పొందిన ఆదినారాయణప్ప కార్డు పంచింగ్ మిషన్‌ల కోసం ఇటీవల తహసీల్దార్ కార్యాలయం వద్దకు వెళ్లాడు. అప్పటికే అక్కడ ఉన్న గ్రామ అధికార పార్టీ నాయకుల ఎదుటనే నారాయణప్పను రెవెన్యూ అధికారి నానా దుర్భాషలాడి అవమానించాడు. ‘ఈ సారి తీసేస్తాం.. దిక్కున్న వారికి చెప్పుకో’ అంటూ బెదిరించాడు. విషయాన్ని ఆర్డీఓ, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా.. అధికారులు స్పందించి ఈనెల 8న కార్డు పంచింగ్ మిషన్ ఇచ్చి బియ్యం పంపిణీ చేయాల్సిందిగా నారాయణప్పకు సూచించారు.
నాలుగు రోజుల్లో మళ్లీ..
స్టాక్‌ను పంపిణీ చేసిన నాలుగు రోజులకే స్టోర్ వద్దకు విజిలెన్సు అధికారులు వచ్చి తనిఖీలు చేశారు. అయితే, ఎలాంటి లోపాలు లేవని తేల్చారు. దీన్ని తట్టుకోలేని స్థానిక అధికార పార్టీ నాయకులు గ్రామంలో తమకు అనుకూలమైన వారితో ఫిర్యాదు చేయించడం గమనార్హం. దీంతో దివ్యాంగుడైన ఆదినారాయణ తీవ్ర ఆందోళన చెందుతున్నాడు. ఉన్న ఫలంగా డీలర్‌షిప్ తీసేస్తే కుటుంబం రోడ్డున పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తనను వేధిస్తున్న వారిపై పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
వైఎస్సార్ సీపీ సానుభూతిపరుడు కావడంతో కక్ష కట్టిన టీడీపీ నాయకులు
హైకోర్టు నుంచి ఉత్తర్వులు వచ్చినా ఆగని వేధింపులు


