రామగిరి: దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్న దొంగను అరెస్ట్ చేసి బంగారు, వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. మంగళవారం సాయంత్రం రామగిరి పోలీసుస్టేషన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. అనంతపురం జిల్లాలోని శెట్టూరు మండలం మాకొడికి గ్రామానికి చెందిన వడ్డే మర్రిస్వామి అలియాస్ సంకేత కర్ణాటక రాష్ట్రంలోని పావగడలో నివాసం ఉంటున్నాడు. వ్యసనాలకు బానిసైన ఇతను పలు చోట్ల అప్పులు చేశాడు. ఈ క్రమంలోనే దేవాలయాల్లో చోరీలకు పాల్పడేవాడు. ముందుగా భక్తుడి వేషంలో వెళ్లి జనసంచారం తక్కువగా ఉండే ఆలయాలను గుర్తించేవాడు. రాత్రి సమయంలో ఇనుప రాడ్ల సహాయంతో తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించి చోరీలకు పాల్పడేవాడు. బంగారం, వెండి ఆభరణాలు, హుండీ నగదును అపహరించేవాడు. దొంగిలించిన వెండి వస్తువులను కరిగించి వెండి బిస్కెట్లుగా మార్చి విక్రయించేవాడు. జిల్లాతో పాటు కర్ణాటకలోని పలు దేవాలయాల్లో కూడా చోరీలకు పాల్పడ్డాడు. సాంకేతిక ఆధారాల ద్వారా నిందితుడిపై నిఘా ఉంచిన ఎస్‌ఐలు టి. ప్రదీప్ రాజ్, ఎస్‌ఐ సత్యనారాయణ ఆధ్వర్యంలోని ప్రత్యేక పోలీసు బృందాలు నిందితుడిని మంగళవారం అదుపులోకి తీసుకున్నాయి. నిందితుడి వద్ద నుంచి 27.5 గ్రాముల బంగారు ఆభరణాలు, 380 గ్రాముల వెండి ఆభరణాలు, ఒక వెండి బిస్కెట్‌తో పాటు చోరీలకు వినియోగించిన మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా రామగిరి సర్కిల్ సీఐ ఎస్‌ఎం అలీ, ఎస్‌ఐలు ప్రదీప్ రాజ్, సత్యనారాయణ, పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు.
27.5, గ్రాముల బంగారం, 380 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం


