గుత్తి: తాగునీటి సమస్యను పరిష్కరించాలని మహిళలు డిమాండ్ చేశారు. గుత్తిలోని జంగాల కాలనీకి చెందిన మహిళలు ఖాళీ బిందెలతో మంగళవారం రోడ్డెక్కి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ 20 రోజులుగా తాగునీటిని సరఫరా చేయడం లేదన్నారు. మున్సిపల్ అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదన్నారు. తాగునీటి కోసం అనేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. వాటర్ ట్యాక్స్ కడుతున్నా ఎందుకు నీటిని సరఫరా చేయడం లేదని ప్రశ్నించారు. తాగునీటిని డబ్బు పెట్టి కొనాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. వెంటనే తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ధర్నాతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం తలెత్తింది. వాహనాలు బారులు తీరాయి. సమస్యను పరిష్కరిస్తామని మున్సిపల్ అధికారులు హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.


