కదిరి: అధికార తెలుగుదేశం పార్టీని అడ్డంపెట్టుకొని రెండేళ్లుగా మున్సిపాలిటీలో పెత్తనం చెలాయిస్తున్న సచివాలయ శానిటరీ సెక్రటరీని ఎట్టకేలకు తప్పించారు. ‘పచ్చ’ ఉద్యోగి..పరిధి దాటి’ శీర్షికన ఆయన చేస్తున్న అవినీతి, అక్రమాలపై ‘సాక్షి’లో రెండు రోజుల క్రితం ప్రముఖంగా ప్రచురించిన విషయం తెలిసిందే. దీనికి మున్సిపల్ కమిషనర్ సందీప్ స్పందించారు. మున్సిపాలిటీకి సంబంధించిన వాహనాల డీజిల్ స్కాంలో పెద్ద మొత్తంలో ఇతను అవినీతికి పాల్పడ్డారని, ఇతని అవినీతి, అక్రమాలపై ‘సాక్షి’లో ప్రచురించిన ప్రతి అంశం వాస్తవమని కమిషనర్ చేపట్టిన విచారణలో బయట పడింది. బదిలీపై వెళ్లిన కమిషనర్ కిరణ్‌కుమార్‌కు ఇతను పీఏ తరహాలో వ్యవహరిస్తూ మున్సిపల్ ఉద్యోగులు, సిబ్బందితో పాటు అన్ని వార్డుల సచివాలయ ఉద్యోగులను బెదిరిస్తూ వచ్చారనే విషయం కూడా కమిషనర్ విచారణలో వెలుగుచూసింది. దీంతో అతన్ని ఆ బాధ్యతల నుంచి తప్పించి మున్సిపాలిటీ ఇన్‌చార్జ్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ నటరాజు బాబుకు బాధ్యతలు అప్పగించారు. ‘మున్సిపాలిటీలో మీ సేవలు ఇక చాలు. సచివాలయానికే పరిమితం కండి’ అంటూ కుటాగుళ్ల–3వ వార్డు సచివాలయానికి పరిమితం చేస్తూ కమిషనర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.


