సోమందేపల్లి చెరువులో మట్టి తోడేళ్లు | - | Sakshi
Sakshi News home page

సోమందేపల్లి చెరువులో మట్టి తోడేళ్లు

May 12 2026 1:26 AM | Updated on May 12 2026 1:26 AM

పెనుకొండ(సోమందేపల్లి): సోమందేపల్లి చెరువులో మట్టి తోడేళ్లు పడ్డాయి. అక్రమంగా మట్టి తరలించేస్తూ సొమ్ము చేసుకుంటున్నాయి. 15 రోజులుగా మట్టి దోపిడీ నిరాటంకంగా సాగుతోంది. కొందరు టీడీపీ నాయకులు అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఎలాంటి అనుమతులు తీసుకోకుండా మట్టిని తరలిస్తుండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు ‘మామూలు’గా పోతుండడంపై స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

క్షేత్రస్థాయి సర్వేలో

పారదర్శకత పాటించాలి

డెడికేటెడ్‌ కమిషన్‌ చైర్మన్‌

రాజీవ్‌ రంజన్‌ మిశ్రా

ప్రశాంతినిలయం: జిల్లాలో అర్బన్‌ ఫ్రేమ్‌ సర్వే (యూఎఫ్‌ఎస్‌), గణాంకాల సేకరణలో పారదర్శకత పాటించాలని డెడికేటెడ్‌ కమిషన్‌ చైర్మన్‌ రాజీవ్‌ రంజన్‌ మిశ్రా పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాలులో కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలు, రిజర్వేషన్ల ఖరారులో పాటించాల్సిన విధివిధానాలపై సుదీర్ఘంగా చర్చించారు. రిజర్వేషన్ల ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ సువర్ణ, సీపీఓ విజయ్‌కుమార్‌, డీపీఓ సమత, మున్సిపల్‌ కమిషనర్లు పాల్గొన్నారు.

టన్ను మామిడి రూ.40 వేలు

అనంతపురం అగ్రికల్చర్‌: స్థానిక కక్కలపల్లి మార్కెట్‌లో సోమవారం టన్ను మామిడి గరిష్టంగా రూ.40 వేలు పలికినట్లు రాప్తాడు మార్కెట్‌ కమిటీ సెక్రటరీ రూప్‌కుమార్‌ తెలిపారు. మార్కెట్‌కు 183 టన్నులు అమ్మకానికి రాగా, వాటిని వేలం వేశామన్నారు. అందులో బేనీషా రకం మామిడి టన్ను గరిష్టంగా రూ.40 వేలు, కనిష్టంగా రూ.15 వేలు, సరాసరిన రూ.24 వేల ప్రకారం ధర పలికాయన్నారు. మల్లికా రకం మామిడి టన్ను గరిష్టంగా రూ.40 వేలు, కనిష్టంగా రూ.20 వేలు, సరాసరిన రూ.30 వేల ప్రకారం ధర పలికాయన్నారు. అలాగే తోతాపురి రకం మామిడి టన్ను గరిష్టంగా రూ.20 వేలు, కనిష్టంగా రూ.10 వేలు, సరాసరిన రూ.15 వేల ప్రకారం క్రయ విక్రయాలు జరిగినట్లు వెల్లడించారు.

ధర్మవరం ఆర్టీసీ డిపోలో

డ్రైవర్లకు ఉద్యోగావకాశాలు

ధర్మవరం అర్బన్‌: ధర్మవరం ఆర్టీసీ డిపోలో ఆన్‌ కాల్‌ డ్రైవర్లుగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు ఆర్టీసీ డీఎం సత్యనారాయణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రోజు వేతనం ప్రాతిపదికన పనిచేసేందుకు హెవీ లైసెన్స్‌ కలిగి ఉండి అనుభవం కలిగిన డ్రైవర్లు అర్హులన్నారు. ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, లైసెన్సుతో ఆర్టీసీ డిపోలోని మేనేజర్‌ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. ఖాళీలు పరిమితంగా ఉండటంతో ముందుగా వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement