పెనుకొండ రూరల్: ప్రజలకు అత్యవసర సేవలు అందించడంలో రక్షక్ వాహనాలు కీలకపాత్ర పోషిస్తాయని ఎస్పీ సతీష్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం మండలంలోని కియా పోలీస్ స్టేషన్‌కు సంఘు హైటెక్ కంపెనీ వారు సీఎస్‌ఆర్ నిధులతో రక్షక్ వాహనాన్ని అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణకు ‘రక్షక్’ వాహనాలు ఉపయోగపడతాయన్నారు. కియా యాజమాన్యం జిల్లాలోని పలు పోలీసుస్టేషన్లకు సీఎస్‌ఆర్ నిధులతో వాహనాలు అందించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో సంఘూ హైటెక్ పరిశ్రమ ప్రతినిధులు చున్సీబ్ కిమ్, డీఎస్పీ నరసింగప్ప, సీఐ రాఘవన్, ఎస్‌ఐలు రాఘవయ్య, రాజేష్, వెంకటేశ్వర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
అర్జీలు పునరావృతం కానీయొద్దు
పుట్టపర్తి టౌన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అర్జీలు పునరావృతమైతే చర్యలు తప్పవని పోలీస్ అధికారులను ఎస్పీ సతీష్‌కుమార్ హెచ్చరించారు. సోమవారం పుట్టపర్తి పోలీస్ కార్యాలయంలోని ఎస్పీ చాంబర్‌లో ‘ప్రజాసమస్యల పరిష్కారి వేదిక’ నిర్వహించారు. వివిధ సమస్యలపై 61 వినతులు అందాయి. ఎస్పీ సతీష్ కుమార్ స్వయంగా దివ్యాంగుల వద్దకు వెళ్లి వినతులు స్వీకరించి బాధితులతో ముఖాముఖి మాట్లాడారు. సమస్యలు ఓపికగా విని సంబంధిత పోలీస్ అధికారులకు ఫోన్ చేసి సూచనలు చేశారు. సమస్య తీవ్రతను తెలుసుకొని చట్టపరిధిలో విచారించి పరిష్కారం చూపాలన్నారు. ఫిర్యాదుదారులతో మర్యాద పూర్వకంగా మాట్లాడాలన్నారు. కార్యక్రమంలో సీఐ బొజ్జప్ప, డీటీఆర్‌సీ సీఐ లక్ష్మీకాంత్‌రెడ్డి, లీగల్ అడ్వైజర్ సాయినాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


