బత్తలపల్లి: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సత్యసాయి తాగునీటి పథకం కార్మికులు అర్ధనగ్న ప్రదర్శనతో సోమవారం ఏడవ రోజు నిరవధిక సమ్మె కొనసాగించారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ జిల్లాలో ప్రజల దాహార్తి తీరుస్తున్న పథకానికి బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఐదు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలు చెల్లించాలన్నారు. సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతోనే సమ్మె చేస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి తమ డిమాండ్లను నెరవేర్చి సమ్మెను విరమింపజేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. అంతకు ముందు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమంలో బత్తలపల్లి, తాడిమర్రి, అప్పరాచెరువు సత్యసాయి తాగునీటి పథకం కార్మికులు పాల్గొన్నారు.


