కదిరి: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం వేడివేడి భోజనం వండి.. వడ్డించి విద్యార్థుల ఆకలి తీరుస్తున్న మధ్యాహ్న బోజన పథకం కార్మికులపై చంద్రబాబు ప్రభుత్వం స్మార్ట్‌గా వేటు వేస్తోంది. స్మార్ట్ కిచెన్ల పేరుతో వారి ఉపాధికి గండి కొట్టే చర్యలు చేపట్టింది. ఇందుకు సంబంధించి జిల్లాలోనూ ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. జిల్లాలో స్మార్ట్ కిచెన్‌లు అందుబాటులోకి వస్తే 1,500 మంది మధ్యాహ్న భోజన ఏజెన్సీల కార్మికులు రోడ్డున పడనున్నారు.
గరిష్టంగా 30 పాఠశాలలకు ఒకటి
మండల కేంద్రాల్లో ఒకట్రెండు స్మార్ట్ కిచెన్లు ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఆ మండలంలోని అన్ని పాఠశాలలకు మధ్యాహ్న భోజనం సరఫరా చేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో స్మార్ట్ కిచెన్ నిర్మాణానికి రూ.55 లక్షలు ఖర్చు చేయనుంది. వీటి నిర్మాణంతో పాటు నిర్వహణ బాధ్యతలు కూడా టీడీపీ కార్యకర్తలకే అప్పగించాలని భావిస్తోంది. ఇప్పటికే వైఎస్సార్ కడప జిల్లాలో ప్రయోగాత్మకంగా 4 స్మార్ట్ కిచెన్‌లు నిర్వహిస్తున్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని, స్మార్ట్ కిచెన్ల ఏర్పాటుకు స్థల పరిశీలన చేయాలని ఇటీవల కలెక్టర్‌ల సమావేశంలో విద్యాశాఖామంత్రి లోకేష్ ఆదేశించారు.
వేడి భోజనం ఇక లేనట్లే!
జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు 1,159, ప్రాథమికోన్నత పాఠశాలలు 230, ఉన్నత పాఠశాలలు 307 ఉన్నాయి. వీటి పరిధిలో 1,27,104 మంది విద్యార్థులున్నారు. వీరికి 1,438 భోజనం ఏజెన్సీల ద్వారా అప్పటికప్పుడు ఆయా పాఠశాలల్లోనే వేడివేడి భోజనం వండి పెడుతున్నారు. భోజనం నాణ్యతను సైతం అక్కడున్న టీచర్లు రోజూ పరిశీలిస్తున్నారు. కానీ మండల కేంద్రంలో స్మార్ట్ కిచెన్లు ఏర్పాటు చేస్తే అక్కడ సిద్ధం చేసిన భోజనాన్ని 5 నుంచి 10 కి.మీ పరిధిలో సగటున 30 పాఠశాలలకు ప్రత్యేక వాహనంలో చేరవేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో భోజనం కోసం విద్యార్థులకు పడిగాపులు తప్పవనిపిస్తోంది. చివరి పాఠశాలకు అందేసరికి వేడి భోజనం కాస్తా చల్లారి పోతుంది. అలాగే నాణ్యతపై ప్రశ్నించే అధికారం కూడా టీచర్లకు ఉండకపోవచ్చు. భవిష్యత్‌లో పాఠశాలలకే కాకుండా అంగన్‌వాడీ కేంద్రాలు, కళాశాలలతో పాటు హాస్టళ్లకూ స్మార్ట్ కిచెన్‌ల నుంచే భోజనం సరఫరా చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
బడుల రూపురేఖలు మార్చేసిన వైఎస్ జగన్
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ‘జగనన్న గోరుముద్ద’ పేరుతో మధ్యాహ్న భోజన పథకాన్ని అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పటిష్టంగా అమలు చేశారు. పిల్లలకు పోషకాలతో కూడిన రుచికరమైన భోజనాన్ని అందించారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ బడులను నిర్వీర్యం చేసే పనిలో పడింది. ఇప్పటికే చాలా మంది పిల్లలు సర్కారు బడి వీడి, ప్రైవేటు, కార్పొరేట్ బాట పట్టారు. ఇలాంటి తరుణంలో స్మార్ట్ కిచెన్ల పేరుతో మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికుల పొట్ట కొట్టే చర్యలకు ప్రభుత్వం దిగడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
జిల్లాలోని పాఠశాలలు 2,078
మధ్యాహ్న భోజన
ఏజెన్సీలు 1,438
విద్యార్థుల సంఖ్య 1,27,104
ఉపాధ్యాయుల సంఖ్య 8,307
పార్టీ కార్యకర్తలకు లబ్ధి చేకూరేలా బాబు ‘స్మార్ట్’ ఆలోచన
జిల్లాలో తొలివిడతలో 10 స్మార్ట్
కిచెన్‌లకు ప్రతిపాదనలు
ఒక్కొక్కటి రూ.55 లక్షలతో ఏర్పాటు
జిల్లాలో రోడ్డున పడనున్న 1,500 మంది కార్మికులు
త్వరలో మధ్నాహ్న భోజన ఏజెన్సీలకు మంగళం
గోరంట్ల మండలంలోని ఒక ఎంపీపీ స్కూల్‌లో 23 మంది విద్యార్థులున్నారు. అక్కడ పిల్లలకు ఓ వితంతు మహిళ మధ్యాహ్న భోజనం వండి పెట్టగా వచ్చిన డబ్బుతో తన ఇద్దరు పిల్లలను
చదివిస్తోంది. చంద్రబాబు సర్కారు
స్మార్ట్ కిచెన్లు ఏర్పాటు చేస్తే ఆమెను ఆ బాధ్యతల నుంచి తప్పిస్తారు. అప్పుడు ఆమె జీవనం దుర్భరంగా మారనుంది. ఈ పరిస్థితి కేవలం ఆమె ఒక్కరిదే కాదు... చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న ‘స్మార్ట్ కిచెన్’ నిర్ణయంతో జిల్లా వ్యాప్తంగా
ఎంతోమంది కార్మికులు రోడ్డున
పడనున్నారు.


