అనంతపురం క్రైం: అవినీతి నిరోధక శాఖ అధికారుల ఉచ్చులో అనంతపురం నగర పాలక సంస్థ ఉద్యోగులు చిక్కుకున్నారు. ఎగ్జిబిషన్ నిర్వాహకుడి నుంచి లంచం తీసుకుంటూ నగరపాలక సంస్థ ఇన్‌చార్జ్ ఎంహెచ్‌ఓ బీఎల్ నరసింహులు, జూనియర్ అసిస్టెంట్ సందీప్‌చౌత సోమవారం అడ్డంగా దొరికిపోయారు. ఏసీబీ డీఎస్పీ ప్రసాదరెడ్డి తెలిపిన మేరకు... అనంతపురంలోని గుత్తి మార్గంలో భారత్ ట్రేడర్స్ పేరుతో రఘుప్రసాదరావు ఎగ్జిబిషన్ నిర్వహణకు అనుమతులు కోరుతూ నగరపాలక సంస్థలో దరఖాస్తు చేసుకున్నాడు. అయితే శానిటరీ సర్టిఫికెట్ జారీకి నగర పాలక సంస్థ అధికారులు రూ.30 వేలు డిమాండ్ చేయడంతో అంత మొత్తం తన వల్ల కాదని, చివరకు రూ.25 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే లంచం ఇవ్వడం ఇష్టం లేని అతను ఈ విషయాన్ని ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. వారి సూచన మేరకు సోమవారం ఉదయం రూ.25 వేలు ఇచ్చేందుకు జూనియర్ అసిస్టెంట్ సందీప్‌చౌతాకు ఫోన్ చేయగా... నగర పాలక సంస్థ సమీపంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద వేచి ఉండాలని తెలిపాడు. ఆ తర్వాత డ్వామా కార్యాలయం వద్దకు రమ్మని తెలిపాడు. దీంతో రఘుప్రసాద్ డ్వామా కార్యాలయం వద్దకెళ్లి అక్కడ వేచి ఉన్న సందీప్‌కు రూ.25 వేలు ఇస్తుండగా... అప్పటికే అక్కడ కాపుకాసిన అనంతపురం–కర్నూలు ఏసీబీ బృందాలు మెరుపు దాడి చేసి పట్టుకున్నాయి. సందీప్‌ను అదుపులోకి తీసుకుని నగదు స్వాధీనం చేసుకున్నారు. దీంతో తాను లంచం డిమాండ్ చేయలేదని ఇన్‌చార్జ్ ఎంహెచ్‌ఓ నరసింహులు సూచన మేరకే డబ్బు తీసుకున్నానని సందీప్ తెలిపాడు. దీంతో ఏసీబీలోని మరో బృందం నగరపాలక సంస్థ కార్యాలయంలోని ఇన్‌చార్జ్ ఎంహెచ్‌ఓ చాంబర్‌కు వెళ్లి నరసింహులును అదుపులోకి తీసుకున్నారు.
ఇళ్లలోనూ సోదాలు
ఇన్‌చార్జ్ ఎంహెచ్‌ఓ బీఎల్‌ఓ నరసింహులు ఫ్లాట్‌తో పాటు అనంతపురంలోని పాతూరులో ఉన్న సందీప్ చౌతా నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో స్థిర, చరాస్తులకు సంబంధించిన పలు పత్రాలు, కొంత నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇదే క్రమంలో ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ అధికారి, ఉద్యోగికి సంబంధించిన ఫోన్‌పే నంబర్లు కూడా పరిశీలించారు. వారి ఫోన్‌పేలకు చాలా మంది కాంట్రాక్టర్లు నగదు బదిలీ చేసినట్లు గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసి ఇద్దరినీ అరెస్ట్ చేసి కర్నూలు ఏసీబీ కోర్టుకు తరలించారు.
సార్ కొత్తగా పైళ్లెంది
ఏసీబీ అధికారులకు దొరికిపోగానే జూనియర్ అసిస్టెంట్ సందీప్ చౌతా తప్పించుకోవాలని తీవ్రస్థాయిలో ప్రయత్నించాడు. ఎక్కడ తన చేతులు కడిగిస్తారోనని పదే పదే చేతులను తన చొక్కాకు, ప్యాంటుకు తుడుచుకున్నాడు. చివరికి ఏసీబీ అధికారులు తమదైన శైలిలో కౌన్సెలింగ్ ఇవ్వగానే ఏడుపు మొదలెట్టాడు. ‘సార్...ఈ మధ్యే నాకు పైళ్లెంది. నన్ను అరెస్ట్ చేస్తే నా జీవితం నాశనమవుతుంది సార్’ అంటూ లబోదిబోమన్నాడు. ఇన్‌చార్జ్ ఎంహెచ్‌ఓ తీసుకోమంటేనే డబ్బు తీసుకున్నానంటూ గగ్గోలు పెట్టాడు.
నేనేమైనా ఉగ్రవాదినా?
కాంట్రాక్టర్లు, కొందరు మీడియా ప్రతినిధులు, ఇన్‌చార్జ్ ఎంహెచ్‌ఓ సిబ్బంది అందరూ ఉండగానే నరసింహులు చాంబర్‌లోకి ఏసీబీ అధికారులు దూసుకెళ్లారు. బీఎల్ నరసింహులు అంటే మీరేనా అంటూ ఆరా తీసి ఏసీబీ అని చెప్పిన అధికారులు అతని సెల్‌ఫోన్ లాక్కొన్నారు. ఆ సమయంలో ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ నేనేమైనా ఉగ్రవాదినా అంటూ ఎదురు తిరిగే ప్రయత్నం చేశారు. తీరా సందీప్‌చౌతా గురించి అడగగానే తెల్లమొహం వేశారు.
ఎగ్జిబిషన్ నిర్వాహకుడి నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం
శానిటరీ సర్టిఫికెట్ జారీకి
రూ.25 వేలు డిమాండ్


