వాహనం ఢీకొని జింక మృతి | - | Sakshi
Sakshi News home page

వాహనం ఢీకొని జింక మృతి

May 12 2026 1:26 AM | Updated on May 12 2026 1:26 AM

పెనుకొండ: స్థానిక యోగా నరసింహస్వామి ఆలయం సమీపంలో 44వ జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ జింక మృతి చెందింది. సోమవారం ఉదయం అటుగా వెళ్లిన వారు గుర్తించి సమాచారం ఇవ్వడంతో ఫారెస్ట్‌ రేంజర్‌ శ్రీనివాసరెడ్డి, అధికారులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. రెండు రోజల క్రితం రోడ్డు దాటుతున్న జింకను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మృతి చెంది ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారించారు. రోడ్డు పక్కనే పోస్టుమార్టం నిర్వహించి జింక కళేబరాన్ని దహనం చేశారు.

ప్రమాదంలో అటవీశాఖ ఉద్యోగికి తీవ్ర గాయాలు

ధర్మవరం రూరల్‌: మండలంలోని పోతుకుంట వద్ద చోటు చేసుకున్న ప్రమాదంలో అటవీశాఖ ఉద్యోగి బి.హనుమంతరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. సోమవారం మధ్యాహ్నం విధులు ముగించుకుని స్వగ్రామమైన మామిళ్లపల్లికి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా మార్గం మధ్యలో పోతుకుంట వద్ద ఆటో ఢీకొంది. ప్రమాదంలో కాలు పూర్తిగా విరిగింది. మూగదెబ్బలు తగిలాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది అక్కడకు చేరుకుని క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ధర్మవరంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించింది. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి వైద్యులు రెఫర్‌ చేశారు. ఘటనపై ధర్మవరం రూరల్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం

ధర్మవరం అర్బన్‌: స్థానిక ప్రభుత్వాస్పత్రి ఎదుట ఉన్న కోటా స్కూల్‌ వద్ద తోపుడు బండిపై ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని సోమవారం ఉదయం అటుగా వెళ్లిన వారు గుర్తించారు. సమాచారం అందుకున్న వన్‌టౌన్‌ పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. సదరు వ్యక్తి బేల్దారి పనులకు వెళ్లి రాత్రి ఆస్పత్రి పరిసర ప్రాంతాల్లో నిద్రిస్తుండేవాడని ప్రాథమికంగా నిర్ధారించారు. ఇన్‌ఫెక్షన్‌ కారణంగా కాలు మొత్తం వాచిపోయి చీము కారుతోంది. జీవించి ఉన్నప్పుడు తన పేరు కిష్టప్ప అని, కొత్త చెరువు గ్రామమని స్థానికులకు తెలిపినట్లుగా సమాచారం. మృతుని పూర్తి వివరాలు తెలియకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు ధర్మవరం వన్‌టౌన్‌ పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

జాతీయ కుస్తీ పోటీలకు ఎంపిక

అనంతపురం టౌన్‌: జాతీయ స్థాయి కుస్తీ పోటీలకు ఉమ్మడి జిల్లా నుంచి ముగ్గురు క్రీడాకారులు ఎంపికయ్యారు. ఇటీవల గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీల్లో పామిడి మండలం గజరాంపల్లికి చెందిన నల్లబోతుల వాణి, రాఘవేంద్ర, శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం నాగినాయని చెరువు తండాకు చెందిన నవీన్‌నాయక్‌ ప్రతిభ చాటి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి పాండురంగారావు, అనంతపురం డీఎస్‌డీఓ మంజుల అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement