విద్యార్థికి కలెక్టర్‌ అభినందన | - | Sakshi
Sakshi News home page

విద్యార్థికి కలెక్టర్‌ అభినందన

May 12 2026 1:26 AM | Updated on May 12 2026 1:26 AM

ప్రశాంతి నిలయం: అంగ వైకల్యాన్ని జయించి ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌ను అధిరోహించిన విద్యార్థిని కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ అభినందించారు. ఏపీ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నిర్వహించిన అడ్వెంచర్‌ స్పోర్ట్స్‌ కార్యక్రమంలో భాగంగా 25 మంది విద్యార్థుల బృందం గత నెల 25న 5,364 మీటర్ల ఎత్తులో ఉన్న బేస్‌ క్యాంప్‌ను చేరుకుని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వీరిలో జిల్లాలోని తనకల్లుకు చెందిన పసల ప్రసాద్‌ ఉన్నారు. తిరిగి వచ్చిన ప్రసాద్‌ సోమవారం కలెక్టర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఆ సమయంలో శాలువా కప్పి కలెక్టర్‌ సత్కరించారు. కార్యక్రమంలో డీఈఓ కిష్టప్ప, స్పోర్ట్స్‌ కన్సల్టెంట్‌ కడపల శంకర్‌, పుల్లన్న తదితరులు ఉన్నారు.

విద్యుదాఘాతంతో బాలుడి మృతి

కనగానపల్లి: విద్యుత్‌ షాక్‌కు గురై ఓ బాలుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన మేరకు.. కనగానపల్లి మండలం బద్ధలాపురం గ్రామానికి చెందిన మధుకుమార్‌గౌడ్‌ నూతన గృహ నిర్మాణం చేపట్టాడు. ఈ క్రమంలో ఇంటి పనులకు నీటి సరఫరా చేసేందుకు సింగిల్‌ ఫేజ్‌ మోటర్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. సోమవారం ఉదయం మధుకుమార్‌ గౌడ్‌ కుమారుడు చరిత్‌గౌడ్‌ (8) మోటార్‌ ఆన్‌ చేస్తుండగా షాక్‌కు గురై కుప్పకూలాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

హ్యాండ్లూమ్‌ టెక్స్‌టైల్‌

టెక్నాలజీలో ప్రవేశాలు

అనంతపురం కల్చరల్‌ : తిరుపతిలోని ప్రగడ కోటయ్య మెమోరియల్‌ ఇండియన్‌ ఇనిస్టిట్యూషన్‌ ఆఫ్‌ హ్యాండ్లూమ్‌ టెక్నాలజీ ఆధ్వర్యంలో హ్యాండ్లూమ్‌ టెక్స్‌టైల్‌ టెక్నాలజీలో ప్రవేశాలు చేపట్టనున్నారు. ఈ మేరకు జిల్లా చేనేత, జౌళీశాఖ అధికారి వరప్రసాద్‌ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మూడేళ్ల డిప్లోమా కోర్సు అనంతరం ఉద్యోగ అవకాశాలతో పాటు పారిశ్రామిక వేత్తలుగా ఎదిగే అవకాశముంది. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన సర్టిఫికెట్లను అందజేస్తారు. మరింత సమాచారం కోసం 93999 36872, 90102 43054 లో సంప్రదించవచ్చు.

ప్రమాదంలో

ఇద్దరికి తీవ్ర గాయాలు

పుట్టపర్తి అర్బన్‌: మండలంలోని మార్లపల్లి గంగమ్మ ఆలయం సమీపంలో చోటు చేసుకున్న ప్రమాదంలో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన మేరకు.. పెడపల్లికి చెందిన మక్తర్‌ అల్లుడు అల్లాబకాష్‌, సుబ్బరాయనిపల్లికి చెందిన శంకరప్ప కుమారుడు రమేష్‌ ఇద్దరూ సోమవారం రాత్రి 7.30 గంటలకు ద్విచక్ర వాహనంపై కియా పరిశ్రమకు బయలుదేరారు. మార్లపల్లి సమీపంలోకి చేరుకోగానే అదుపు తప్పి కిందపడడంతో తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళుతున్న వారు గుర్తించి వెంటనే ఆ మార్గంలో వెళుతున్న కారులో పెనుకొండలోని ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement