కొండెక్కితే బాదుడే ! | - | Sakshi
Sakshi News home page

కొండెక్కితే బాదుడే !

May 11 2026 9:37 AM | Updated on May 11 2026 9:37 AM

అబ్బుర పరిచే రహదారి.. కనువిందు చేసే కోట అందాలు.. ఆహ్లాద పరిచే వాతావరణం.. అందుకే పెనుకొండ కొండపైకి వెళ్లేందుకు ఉమ్మడి అనంతపురం వాసులే కాకుండా బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తుంటారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం తాజాగా టోల్‌ ట్యాక్స్‌ అంటూ కొండపైకి వెళ్లే వాహనదారుల నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తోంది. దీంతో పర్యాటక అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారుతోంది.

సాక్షి, పుట్టపర్తి: ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన పెనుకొండ కోటకు పూర్వ వైభవం తెచ్చేందుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. ఇందులో భాగంగానే ఇక్కడ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. పెనుకొండ కొండపైకి వెళ్లేందుకు రూ.20 కోట్లు వెచ్చించి కొండపై వరకు రోడ్డు కూడా నిర్మించారు. ఇన్నాళ్లూ రూపాయి ఖర్చు లేకుండా పర్యాటకులు పెనుకొండ కోటను సందర్శించే వారు. అయితే తాజాగా అటవీశాఖ ఆధ్వర్యంలో టోల్‌గేట్‌ ఏర్పాటు చేయడంతో పర్యాటకుల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. మంత్రి సవిత ప్రాతినిథ్యం వహిస్తున్న పెనుకొండలో టోల్‌ బాదుడుపై ప్రజలు, పర్యాటకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

వారంతంలో కిట కిట

పెనుకొండ కోటను సందర్శించేందుకు ప్రతి శని, ఆదివారాల్లో ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచే కాకుండా బెంగళూరు నుంచి వేలాది మంది పర్యాటకులు బైక్‌లు, కార్లలో వస్తుంటారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కొండపైకి రోడ్డు వేసినప్పటి నుంచి పర్యాటకుల సంఖ్య బాగా పెరిగింది. అంతకు ముందు వందల సంఖ్యలో వెళ్లే పర్యాటకులు రోడ్డు పూర్తయ్యాక వేల సంఖ్యకు చేరారు. అయితే తాజాగా టోల్‌ గేట్‌ ఏర్పాటు చేయడంతో పర్యాటకులు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని స్థానికులతో పాటు పర్యాటకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మంత్రిగా ఉన్నప్పటికీ..

పెనుకొండ నుంచి గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన శంకరనారాయణ మంత్రిగా పని చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో అప్పట్లోనే పెనుకొండ కోట అభివృద్ధి చేయాలని భావించారు. ఈ క్రమంలో ప్రభుత్వంతో మాట్లాడి రూ.20 కోట్లు వెచ్చించారు. అయితే గతంలో సుంకం వసూలు చేయలేదు. కానీ పెనుకొండ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న సవిత టోల్‌ను ఎందుకు ప్రోత్సహిస్తున్నారని పర్యాటకులు ప్రశ్నిస్తున్నారు. ప్రజలు, పర్యాటకుల గురించి ఆలోచించకుండా టోల్‌ ప్రారంభోత్సవంలోనూ పాల్గొనడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

మంత్రి సవిత ఇలాకాలో ‘టోల్‌’ దందా

పెనుకొండ కొండపైకి వెళ్లే వాహనదారుల నుంచి టోల్‌ వసూలు

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రూ.20 కోట్లతో అభివృద్ధి

టోల్‌ వసూలుపై సర్వత్రా విమర్శలు

టోల్‌ వసూలు దుర్మార్గం

గత ప్రభుత్వంలోనే కొండపైకి రోడ్డు

పెనుకొండ వాసులకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించడమే కాకుండా, వాణిజ్య, వ్యాపారంగా అభివృద్ధి చేసేందుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రయత్నించింది. పెనుకొండ కొండ రోడ్డు కారణంగా సందర్శకుల తాకిడి పెరిగింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం ప్రస్తుతం కొండపైకి వెళ్లే వాహనదారుల నుంచి టోల్‌ ట్యాక్స్‌ వసూలు చేయడం దుర్మార్గం. దీని వల్ల పర్యాటకుల సంఖ్య తగ్గిపోయే అవకాశం ఉంది. వెంటనే టోల్‌ ట్యాక్స్‌ వసూళ్లను రద్దు చేయాలి.

– ఉషశ్రీచరణ్‌, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు

శ్రీకృష్ణదేవరాయలు పాలించిన పెనుకొండను పర్యాటక ప్రాంతంగా మార్చాలనే గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఎన్నో చర్యలు చేపట్టాము. ఇందులో భాగంగానే రూ.20 కోట్లతో కొండపైకి రోడ్డు నిర్మించాము. అప్పటి నుంచి ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తున్నారు. అభివృద్ధిని కొనసాగించాల్సిన చంద్రబాబు ప్రభుత్వం దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తుండటం సరికాదు. కొండ ఎక్కే వాహనదారుల నుంచి టోల్‌ వసూలు చేయడం అన్యాయం.

– మాలగుండ్ల శంకరనారాయణ, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు

Advertisement
 
Advertisement
Advertisement