అమ్మ కడుపులోనే హత్య! | - | Sakshi
Sakshi News home page

అమ్మ కడుపులోనే హత్య!

May 11 2026 9:37 AM | Updated on May 11 2026 9:37 AM

● ధర్మవరం మండలానికి చెందిన దంపతులకు ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు సంతానం. మూడోసారి మగబిడ్డ కావాలనుకున్నారు. సదరు మహిళ గర్భందాల్చగానే భర్త ఓ స్కానింగ్‌ సెంటర్‌ను సంప్రదించాడు. వారు చెప్పిన అడ్రెస్‌కు వెళ్లగా.. స్కానింగ్‌ మాత్రమే అయితే రూ.6 వేలు, ఆడబిడ్డ అయితే తీసేసేందుకు మరో రూ.20 వేలు అంటూ ధరల పట్టిక చెప్పారు. స్కానింగ్‌లో అమ్మాయి అని తేలగానే మొత్తంగా రూ.30 వేలు తీసుకుని అబార్షన్‌ చేశారు.

.. ఇలా జిల్లాలో నిత్యం బ్రూణ హత్యలు జరుగుతూనే ఉన్నాయి. ఆడ అని తెలిస్తే చాలు పిండాన్ని కరిగించేస్తున్నారు. డబ్బులకు కక్కుర్తి పడుతున్న స్కానింగ్‌ సెంటర్ల నిర్వాహకులు లింగనిర్ధారణ పరీక్షలు చేస్తుండగా... గర్భిణులు ఒప్పుకోకపోయినా కుటుంబీకుల బలవంతంతో కొందరు వైద్యులు అబార్షన్లు చేస్తున్నారు.

సాక్షి, పుట్టపర్తి: ఎన్ని రకాలుగా అవగాహన కల్పించినా భ్రూణ హత్యలు జరుగుతూనే ఉన్నాయి. మగవారితో సమానంగా చదువు, ఉద్యోగం, వివిధ రంగాల్లో పోటీ పడుతున్నా.. తల్లి గర్భంలో నుంచి భూమిపై అడుగు పెట్టనివ్వడం లేదు. ‘ఆడబిడ్డను బతకనిద్దాం.. బతుకునిద్దాం’ అని ఊరూరా అవగాహన కల్పిస్తున్నప్పటికీ మార్పు రావడం లేదు. శ్రీసత్యసాయి జిల్లా వ్యాప్తంగా చాలా ఆస్పత్రులు, స్కానింగ్‌ సెంటర్‌లలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఆడపిల్ల అయితే తీసేయండి అని దంపతులు సహకరిస్తున్న దాఖలాలు వెలుగు చూస్తున్నాయి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో జిల్లా వ్యాప్తంగా పలు స్కానింగ్‌ సెంటర్‌లలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఆ తర్వాత గర్భిణి ఒప్పుకుంటే.. అబార్షన్‌ చేసేస్తున్నారు. ప్రమాదమని తెలిసినా గర్భంలోనే ఆడపిల్లలను చిదిమేస్తున్నారు.

యథేచ్ఛగా లింగ నిర్ధారణ

జిల్లా వైద్యారోగ్య శాఖాధికారులు నిత్యం ఆస్పత్రులు తనిఖీలు చేస్తున్నట్లు చెబుతున్నారు. కానీ లింగ నిర్ధారణ చేస్తున్న సెంటర్ల జోలికి మాత్రం వెళ్లడం లేదు. దీంతో యథేచ్ఛగా లింగ నిర్ధారణ చేసి కోడ్‌ భాషలో ఆడ, మగ అనేది గర్భిణులకు తెలియజేస్తున్నారు. మగ పిల్లాడు అయితే ‘6’ అని.. ఆడ పిల్ల అయితే ‘9’ అనే నంబర్లు వినియోగిస్తూ సమాధానం ఇస్తున్నారు. ముందుగానే ఫోన్‌లో సంప్రదించి.. బస్టాండు చేరుకోవాలని చెబుతారు. అక్కడికి ఆస్పత్రి సిబ్బంది వెళ్లి.. కేవలం గర్భిణిని మాత్రమే తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేసి పంపిస్తున్నారు. అందరూ వెళ్లిపోయాక తర్వాత ఫోన్‌ కాల్‌ చేసి కోడ్‌ భాషలో రిపోర్టుల గురించి వివరిస్తారు.

గుట్టు చప్పుడు కాకుండా..

గ్రామస్థాయిలో ఆర్‌ఎంపీలు, చిన్న క్లినిక్‌ల ద్వారా గుట్టు చప్పుడు కాకుండా ఈ దందా జరుగుతున్నట్లు తెలిసింది. కొందరు ఆర్‌ఎంపీలు మగపిల్లాడి కోసం ఎదురు చూసే అమాయకులను మభ్యపెట్టి ధనార్జనే ధ్యేయంగా స్కానింగ్‌ సెంటర్లకు పంపిస్తున్నారు. పుట్టబోయేది ఆడబిడ్డ అనేది తెలిస్తే ముందుగా ఒప్పందం చేసుకున్న ప్రైవేటు ఆస్పత్రులు, స్కానింగ్‌ సెంటర్‌లకు పంపించి అబార్షన్‌ చేయిస్తున్నారు.

‘ఆ’ పేరు చెబితే కడుపులోనే ఖతం

జిల్లాలోని స్కానింగ్‌ సెంటర్లలో గుట్టుగా లింగ నిర్ధారణ పరీక్షలు

డబ్బు తీసుకుని

అబార్షన్‌ చేస్తున్న సిబ్బంది

ల్యాబ్‌లు, నర్సింగ్‌ హోమ్‌లపై దృష్టి సారించని అధికారులు

తనిఖీలు చేస్తున్నాం

గర్భస్థ లింగ నిర్ధారణ ప్రక్రియ చట్టాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేస్తున్నాం. కలెక్టర్‌ ఆదేశాల మేరకు.. పోలీసు ఇతర శాఖల సమన్వయంతో స్కానింగ్‌ సెంటర్‌లను తనిఖీలు చేస్తున్నాం. నిబంధనలు పాటించని వారికి నోటీసులిస్తున్నాం. లింగ నిర్ధారణకు పాల్పడినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం.

– డాక్టర్‌ ఫైరోజాబేగం,

జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి

Advertisement
 
Advertisement
Advertisement