హిందూపురం: పట్టణంలోని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ ఆవరణంలో ఎస్పీ సతీష్‌కుమార్ ఏడు నూతన ద్విచక్ర వాహనాలకు పూజ చేసి జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ సతీష్‌కుమార్ మాట్లాడుతూ ప్రజల భద్రత, పోలీసుల తక్షణ స్పందన, రాత్రి పహారా బలోపేతమే లక్ష్యంగా రక్షక్ వాహనాలను అందిస్తున్నట్లు తెలిపారు. వీటిని ఉపయోగించుకొని అత్యవసర పరిస్థితుల్లో పోలీసులు వేగంగా స్పందిస్తారన్నారు. హిందూపురం నియోజకవర్గంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజాప్రతినిధులు పోలీసు శాఖకు అందిస్తున్న సహకారం అభినందనీయమన్నారు. రూ.15 లక్షల విలువ గల ఏడు వాహనాలను దాతలు అందించడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ మహేష్, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
హనుమజ్జయంతి
ఉత్సవాలు ప్రారంభం
గుంతకల్లు రూరల్: కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో ఆదివారం హనుమజ్జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేకువజామునే ప్రత్యేక యాగశాలలో ఆలయ ఈఓ మేడేపల్లి విజయరాజు, ధర్మకర్త సుగుణమ్మ ఆధ్వర్యంలో కలశ ప్రతిష్ట, గణపతి పూజ, పుణ్యాహవచనం, మంటపారాధన, పంచగవ్యప్రాశన, గోపూజ, సుందరకాండ మన్యుసూక్తపారాయణ హోమం నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు ఆలయ ముందు భాగంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై స్వామివారి ఉత్సవ మూర్తిని కొలువుదీర్చి ప్రత్యేక పూజలు చేశారు. తమలపాకులతో లక్షార్చన చేసిన తర్వాత భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.


