ముదిగుబ్బ: చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం కారణంగా రైతులకు ఫ్రీహోల్డ్ కష్టాలు మొదలయ్యాయి. ఫ్రీహోల్డ్ భూముల వివరాలు వన్‌బీ అడంగల్‌లో రాకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. అలాగే రీ సర్వే చేసిన భూములకు కూడా కొన్ని సర్వే నంబర్లు గల్లంతయ్యాయి. రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో అన్నదాతల కష్టాలు చెప్పనలవిగా మారాయి.
దిక్కుతోచని స్థితిలో..
రైతులు పంటలు సాగు చేసుకునే నిమిత్తం బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను ఏడాదికోసారి రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి భూమి వివరాలు తెలిపే వన్‌బీ అడంగల్‌ను సమర్పించాల్సి ఉంటుంది. అయితే, ఫ్రీహోల్డ్ భూములకు సంబంధించిన వన్‌బీ అడంగల్ ఆన్‌లైన్‌లో రావడం లేదు. ‘మీ సేవ’ వారు తెల్లకాగితంపై వివరాలు రాసిస్తున్నారు. ఆ కాగితంపై వీఆర్‌ఓ, తహసీల్దార్‌తో సంతకం చేయించుకున్న అనంతరం రైతులు బ్యాంకులకు వెళ్తున్నారు. ఈ క్రమంలో బ్యాంక్ సిబ్బంది వెబ్‌ల్యాండ్‌లో భూముల వివరాలు పరిశీలన చేస్తున్నారు. వారికి ఆయా భూముల వివరాలు కనిపించకపోవడంతో పంట రుణ పరిమితి పెంచడం లేదు. దీనికితోడు రూ.3 లక్షల వరకు రుణం తీసుకున్న రైతులకు రూ.లక్ష తిరిగి బ్యాంకుకు చెల్లించమని సిబ్బంది చెబుతుండడంతో వారికి దిక్కుతోచడం లేదు. ఇక.. రీ సర్వే జరిగిన గ్రామాల్లోనూ ఒకే సర్వే నంబర్‌లో అన్నదమ్ముల భాగాలు వన్‌బీ అడంగల్‌లో కనిపించకపోవడం గమనార్హం.
మెలిక పెట్టి.. కష్టాల్లోకి నెట్టి
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు మంచి చేయాలనే ఉద్దేశంతో 20 సంవత్సరాల అనుభవంలో ఉన్న భూమిని క్రయ విక్రయాలు చేసుకునేందుకు జీవోను విడుదల చేశారు. అయితే, చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. భూముల వివరాలు ఆన్‌లైన్‌లో కనిపించకుండా హోల్డ్‌లో పెట్టారు. విచారణ తరువాత భూములను విడుదల చేస్తామని మెలిక పెట్టి రెండేళ్లు గడుస్తున్నా ఎటూ తేల్చకుండా రైతులను అవస్థలకు గురి చేస్తున్నారు. దీనిపై అన్నదాతలు మండిపడుతున్నారు.
వన్‌బీలో కానరాని భూముల వివరాలు
రీ సర్వేలో తప్పులతోనూ ఇబ్బందులు
నానా కష్టాలు పడుతున్న అన్నదాతలు
పట్టించుకోని చంద్రబాబు సర్కారు
ముదిగుబ్బ మండలంలో క్రాప్ లోన్ వివరాలిలా..
ని‘బంధనాల’తో కష్టాలు
పంట రుణాలు ఒక బ్యాంక్‌లో మాత్రమే తీసుకోవాలని బ్యాంక్ అధికారులు చెబుతుండడం అన్నదాతలను మరింతగా కుంగదీస్తోంది. గతంలో చాలా మంది రైతులు సొసైటీల్లో పాసుపుస్తకం జిరాక్స్‌లతో పంట రుణాలను తీసుకున్నారు. నేడు ఒక రైతుకు ఒక బ్యాంక్‌లో మాత్రమే పంట రుణం ఉండాలని ప్రభుత్వం నిబంధనలు విధించడంతో ఇబ్బందులు తప్పడం లేదు.


