బత్తలపల్లి: మండల పరిధిలోని పోట్లమర్రి సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద శనివారం రాత్రి రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు. బత్తలపల్లి పోలీసులు తెలిపిన మేరకు.. తాడిమర్రి మండలం నిడిగల్లు గ్రామానికి చెందిన గోనుగుంట్ల ఆంజనేయులు కుమారుడు గోనుగుంట్ల దేవేంద్రనాయుడు (29) ధర్మవరం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో కిరాణ దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం రాత్రి దుకాణం మూసి వేసి స్వగ్రామానికి ద్విచక్రవాహనంలో బయలుదేరాడు. బత్తలపల్లి మండలం పోట్లమర్రి సమీపంలోని పెట్రోల్ బంకు దాటిన తరువాత కల్వర్ట్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీ కొంది. ఈ ప్రమాదంలో అతని తల, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 వాహనంలో ఆర్డీటీ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం తీసుకెళ్లగా.. చికిత్స ఫలించక ఆదివారం మృతి చెందాడు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు బత్తలపల్లి పోలీసులు తెలిపారు.
లేపాక్షిలో కుక్క
స్వైర విహారం
లేపాక్షి: లేపాక్షిలోని బస్టాండు ఆవరణంలో ఆదివారం ఓ కుక్క స్వైర విహారం చేసింది. 12 మందిని కరిచి గాయపరిచింది. వెంటనే వారిని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 9 మందికి వైద్య సిబ్బంది వ్యాక్సిన్ వేసి మందులు పంపిణీ చేశారు. ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానిక ప్రజలు కుక్కను కొట్టి చంపేశారు. ఎంపీడీఓ శ్రీనివాసులు, పంచాయతీ కార్యదర్శి నాగరాజు ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారి వెంకటచిరంజీవికి సూచించారు.
సమస్యలు పరిష్కరిస్తేనే సమ్మె విరమణ
బత్తలపల్లి: తమ న్యాయమైన సమస్యలకు పరిష్కారం చూపితేనే సమ్మె విరమిస్తామని సత్యసాయి తాగునీటి పథకం కార్మికులు స్పష్టం చేశారు. ఆదివారం బత్తలపల్లిలోని సత్యసాయి వాటర్ ట్యాంకు వద్ద సత్యసాయి కార్మికులు నల్ల బ్యాడ్జ్‌లు ధరించి ఆరవ రోజు సమ్మె కొనసాగించారు. నిరసన శిబిరం వద్దకు సత్యసాయి బోర్డు ఎస్‌ఈ ప్రభాకర్‌రావు చేరుకొని కార్మికులతో చర్చించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కార్మికులకు అనుకూలంగా ప్రకటన చేశారని, సమ్మెను విరమించి విధుల్లోకి చేరాలని కోరారు. అయితే, కార్మికులు మాత్రం తమ న్యాయమైన సమస్యలకు పరిష్కారం చూపితేనే సమ్మె విరమిస్తామని స్పష్టం చేయడంతో ఆయన వెనుదిరిగి వెళ్లారు. కార్యక్రమంలో బత్తలపల్లి, తాడిమర్రి, అప్పరాచెరువు సత్యసాయి కార్మికులు పాల్గొన్నారు.
ఐషర్‌ను ఢీకొన్న లారీ
●16 మంది భక్తులకు గాయాలు
మదనపల్లె టౌన్: ఐషర్‌ను లారీ ఢీకొనడంతో 16 మంది భక్తులకు గాయాలైన ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలంలో జరిగింది. రెండో పట్టణ సీఐ మహ్మద్ రఫి తెలిపిన మేరకు.. పుట్లూరు మండలం కడవకల్లు గ్రామానికి చెందిన 60 మంది భక్తులు బోయకొండకు ఐషర్, బొలెరో వాహనాల్లో బయలుదేరారు. మదనపల్లె బైపాస్‌లో ఉన్న రాయల్ ఉడ్ దగ్గర ఆదివారం వేకువజామున ఐషర్‌ను వెనుక నుంచి లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో 16 మందికి గాయాలయ్యాయి. మిగిలిన వారికి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. స్థానికులు స్పందించి క్షతగాత్రులను ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వెంటనే చికిత్స అందించడంతో వారంతా ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.
గాయపడిన వారు..
రోడ్డు ప్రమాదంలో రాజేశ్వరి, లక్ష్మీనారాయణకు తీవ్ర గాయాలు కావడంతో డాక్టర్లు మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి రెఫర్ చేశారు. స్వల్పంగా గాయపడిన వారిలో సహస్ర, అశ్వని, లక్ష్మీదేవి, రమాశ్రీ, అరుణ, పుల్లమ్మ, గంగాధర్, వెంకటరాయుడు, కుల్లాయమ్మ, శివశంకర్, లక్ష్మి, రాజా, లక్ష్మీదేవి, భవ్యశ్రీ మదనపల్లె ఆసుపత్రిలోనే చికిత్సలు పొందుతున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ వాహనం వదిలేసి పరారయ్యాడు. టూ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం ఆస్పత్రి వద్దకు వచ్చి క్షతగాత్రులను విచారించారు. కేసు నమోదు అనంతరం సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నట్లు సీఐ మహమ్మద్ రఫి తెలిపారు.


