● వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆవుటాల రమణారెడ్డి
పుట్టపర్తి టౌన్: పుట్టపర్తి విమానాశ్రయ సమీపంలో ఏపీఐఐసీ వారు సేకరిస్తున్న భూ సేకరణ లోపభూయిష్టంగా ఉందని వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆవుటాల రమణారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. బ్రాహ్మణపల్లి, బీడుపల్లి రెవెన్యూ గ్రామాలలో వివిధ వర్గాలకు చెందిన రైతులకు ఒకటి, రెండు ఎకరాల భూమి ఉందన్నారు. గతంలో కూడా సత్యసాయి విమానాశ్రయం కోసం కొంత మేరకు భూములు తక్కువ ధరలకు ఇచ్చారన్నారు. మళ్లీ నేడు రెవెన్యూ అధికారులు భూసేకరణ చేపట్టారన్నారు. అందులో 70 శాతం గిరిజనుల కుటుంబాలకు సంబంఽధించి భూమి ఉందని, నూతన జిల్లా ఏర్పాటు చేయడంతో ఎకరం భూమి కోటి రూపాయలకు పైగా పలుకుతోందన్నారు. అలాంటి భూములను రెవెన్యూ అధికారులు బలవంతంగా సేకరిస్తున్నారన్నారు. ఇందులో 2013 భూసేకరణ చట్టం ప్రకారం పారదర్శకత లేకుండా పోయిందన్నారు. భూములు కోల్పోతున్న రైతులకు న్యాయపరమైన పరిహారంతోపాటు ఇంటి స్థలాలు, ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ అద్దె బస్సు
ఓడీచెరువు(నల్లమాడ): ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ అద్దె బస్సు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన ఘటన నల్లమాడ మండలంలో జరిగింది. వివరాలు.. పుట్టపర్తి డిపోనకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సు ప్రయాణికులతో కదిరి నుంచి కొత్తచెరువుకు వెళుతుండగా నల్లమాడ సమీపంలోని షాదీమహల్ వద్ద అదుపు తప్పింది. బస్సు బ్రేకులు పడకపోవడంతో అప్రమత్తమైన డ్రైవర్ బస్సును పొలాల్లోకి మళ్లించాడు. కొద్దిదూరం వెళ్లాక బస్సు ఆగిపోయింది. ఈ క్రమంలో భయపడిన కొందరు ప్రయాణికులు బస్సు కిటికీల ద్వారా బయటకు దూకారు. బస్సులో ఉన్న 22 మంది ప్రయాణికులు క్షేమంగా బయటపడినట్లు కండక్టర్ నాగేంద్రనాయక్ తెలిపాడు.
వడదెబ్బతో యువరైతు మృతి
ఓడీచెరువు(నల్లమాడ): నల్లమాడ మండలం మస్కవంకపల్లిలో ఓ యువరైతు వడదెబ్బతో మృతి చెందాడు. మృతుని కుటుంబీకులు తెలిపిన వివరాల మేరకు... మస్కవంకపల్లికి చెందిన చాగలేటి రామచంద్ర(37) వ్యవసాయం చేస్తూ కుటుంబానికి చేయూతగా ఉంటున్నాడు. తనకున్న రెండెకరాల్లో వేరుశనగ సాగుచేసిన రామచంద్ర...రెండురోజుల క్రితం పంటకు పురుగుల మందు కొడుతూ అస్వస్థతకు గురయ్యాడు. తీవ్ర జ్వరంతో బాధపడుతుండగా కుటుంబీకులు నల్లమాడలోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయినా కోలుకోలేక ఆదివారం ఉదయం రామచంద్ర మృతి చెందాడు. మృతుడు అవివాహితుడు.
మూగ మహిళపై అత్యాచారయత్నం
పుట్లూరు: కూలీ పనులకు వెళ్లిన ఓ మూగ మహిళపై అరటి తోట యజమాని అత్యాచార యత్నం చేశాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు ఆదివారం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సురేంద్రబాబు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని ఓ గ్రామానికి చెందిన మూగ మహిళ ఈ నెల 8న అదే గ్రామానికి చెందిన రమణారెడ్డి అరటి తోటలోకి కూలీ పనులకు వెళ్లింది. పనులు చేస్తున్న సమయంలో మహిళపై గాలి రమణారెడ్డి అత్యాచారానికి యత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.


