సొంత ఖర్చుతో నీరందిస్తే అడ్డుకుంటారా? | - | Sakshi
Sakshi News home page

సొంత ఖర్చుతో నీరందిస్తే అడ్డుకుంటారా?

May 11 2026 9:37 AM | Updated on May 11 2026 9:37 AM

ముదిగుబ్బ: యువకులు సేవాభావంతో ముందుకు వచ్చి తమ సొంత ఖర్చులతో నీరందిస్తే అడ్డుకుంటారా అంటూ పంచాయతీ కార్యదర్శిపై మహిళలు తిరగబడిన ఘటన ఆదివారం మద్దన్నగారిపల్లిలో చోటుచేసుకుంది. వివరాలు.. మండలంలోని మద్దన్నగారిపల్లిలో 250 కుటుంబాలు నివాసముంటున్నాయి. పంచాయతీ తరఫున మూడు బోర్లు వేయించినా మోటార్లను బిగించకపోవడంతో కొద్దిరోజులుగా నీటి ఎద్దడి నెలకొంది. ఈ క్రమంలోనే ఆదివారం గ్రామానికి చెందిన రఘు, మునీంద్ర, హర్ష, బాబులు తమ సొంత ఖర్చుతో రెండు ట్యాంకర్లతో తాగునీరు సరఫరా చేశారు. అయితే ఆర్‌డబ్ల్యూఎస్‌ జేఈ ప్రసాద్‌, పంచాయతీ కార్యదర్శి ఆ యువకులకు ఫోన్‌ చేసి ఎవరి అనుమతితో నీరు సరఫరా చేస్తున్నారంటూ బెదిరించినట్లు సమాచారం. గ్రామస్తులకు స్వచ్ఛందంగా నీరందిస్తే బెదిరించడమేమిటని యువకులు అధికారులను ప్రశ్నించారు. దీంతో పంచాయతీ కార్యదర్శి వచ్చి ఆ యువకులను అడ్డుకునే ప్రయత్నం చేయగా.. స్థానిక మహిళలు ఒక్కసారిగా కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యువకులు స్వచ్ఛందంగా సమస్యను పరిష్కరిస్తుంటే మీకు వచ్చిన బాధ ఏమిటంటూ నిలదీయడంతో కార్యదర్శి అక్కడి నుంచి జారుకున్నారు. గ్రామంలో నీటి సమస్య ఉందని పలుమార్లు అధికారులకు చెప్పినా పట్టించు కోలేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.

పంచాయతీ కార్యదర్శిపై

తిరగబడ్డ మహిళలు

Advertisement
 
Advertisement
Advertisement