కదిరి: ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ప్రజలు మంచినీటికి ఇబ్బంది పడుతున్నారని, గుక్కెడు నీళ్లిచ్చే స్థితిలో కూడా చంద్రబాబు ప్రభుత్వం లేదని మాజీ మంత్రి శైలజానాథ్, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా సురక్షితమైన తాగునీరు సరఫరా చేస్తామని ఎన్నికల సమయంలో చెప్పిన హామీ ఏమైంది బాబూ అని ప్రశ్నించారు. ఆదివారం వారు కదిరిలో మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా స్వగృహానికి విచ్చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల భూములను రీ సర్వే చేసి, క్యూఆర్ కోడ్‌తో పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేసిన ఘనత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. ట్యాంపరింగ్‌కు అవకాశం లేకుండా, భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపారన్నారు. చంద్రబాబు రైతులకు సకాలంలో పాసుపుస్తకాలు ఇవ్వనందున రైతులు బ్యాంకుల్లో రుణాలు పొందలేక పోతున్నారని, బిడ్డ పెళ్లికి ఎకరం భూమి అమ్మాలన్నా ఇబ్బంది పడుతున్నారని వారు వాపోయారు. ఎన్నికల సమయంలో ఉద్యోగులకు చంద్రబాబు ఎన్నో హామీలిచ్చారని, కానీ వారికి న్యాయబద్ధంగా రావాల్సిన డీఏలు గానీ, పీఆర్‌సీ గానీ.. ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. ప్రతి మహిళకు నెలకు రూ. 1,500, నిరుద్యోగులకు రూ. 3 వేలు, 20 లక్షల ఉద్యోగాలు ఎప్పుడిస్తావు బాబూ అని ప్రశ్నించారు. అంతకు మునుపు వారిరువురినీ అత్తార్ ఘనంగా సన్మానించారు.


