● కిడ్నాపర్ కదిరి ఎమ్మెల్యే కందికుంట
అనుచరుడిగా గుర్తింపు
● ఓడీ చెరువు పోలీసులకు
ఫిర్యాదు చేసిన బాధితుడు
● పోలీసుల అదుపులో కిడ్నాపర్ షాబాజ్
కదిరి/ఓడీచెరువు: ఓడీ చెరువు మండలం బాబాసాహెబ్‌పల్లెలో శనివారం కిడ్నాప్ కలకలం రేపింది. గ్రామస్తులు ఒక్కటై ప్రతిఘటించారు. ఈలోగా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అంతలోగా కిడ్నాపర్లు కొందరు పారిపోగా, ప్రధాన నిందితుడు కదిరికి చెందిన వేముల షాబాజ్ పోలీసులకు పట్టుబడ్డాడు. ఇతను కదిరి టీడీపీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్‌తో దిగిన ఫొటోలను బట్టి ఆయన అనుచరుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితుడు మహబూబ్‌బాషా కథనం ప్రకారం... కదిరి–మదనపల్లి రోడ్డులో నాగిరెడ్డిపల్లి సమీపాన మహబూబ్‌బాషాకు 1.68 ఎకరాల భూమి ఉంది. దీన్ని ఇటీవల కదిరి ఎమ్మెల్యే కందికుంట అనుచరుడిగా భావిస్తున్న వేముల షాబాజ్‌కు రూ.30 లక్షలకు విక్రయించాడు. రూ.15 లక్షలు అడ్వాన్స్ తీసుకుని అగ్రిమెంట్ చేయించాడు. మిగిలిన రూ.15 లక్షలు ఇవ్వగానే రిజిష్టర్ చేయిస్తానని ఒప్పందం కుదుర్చుకున్నారు. మిగిలిన డబ్బు ఇవ్వకుండానే రిజిస్ట్రేషన్ చేయించాలని మహబూబ్‌బాషాను రెండు,మూడు సార్లు షాబాజ్ బలవంత పెట్టాడు. తనకు ఇవ్వాల్సిన మిగిలిన డబ్బు చెల్లిస్తేనే రిజిస్ట్రేషన్‌కు వస్తానని, లేదంటే మీరు అడ్వాన్స్‌గా ఇచ్చిన రూ.15 లక్షలు వాపసు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెబుతూ వచ్చాడు. ఈ క్రమంలోనే శనివారం కదిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ముందే మాట్లాడుకుని రిజిస్ట్రేషన్‌కు రంగం సిద్ధం చేశారు. షాబాజ్‌తో పాటు మరికొందరు ఒక వాహనంలో వెళ్లి మహబూబ్‌బాషాను బలవంతంగా తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని పథకం వేశారు. ఇందులో భాగంగా వారు బాబాసాహెబ్‌పల్లెకు వెళ్లి అతన్ని బలవంతంగా ఎత్తుకెళ్లాలని ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారు.ఈలోగా పోలీసులు అక్కడికి చేరుకోవడంతో షాబాజ్ పట్టుబడగా, మిగిలిన వారు పరారయ్యారు. బాధితుడు మహబూబ్‌బాషా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు నల్లమాడ సీఐ శ్రీనివాసులు తెలిపారు.
తాగునీటి సమస్యలు తలెత్తకూడదు
● యుద్ధప్రాతిపదికన చర్యలు
తీసుకోవాలని కలెక్టర్ ఆదేశం
ప్రశాంతి నిలయం: ‘‘వేసవిలో జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్యలు తలెత్తకూడదు. ఎక్కడైనా చిన్న చిన్న మరమ్మతు పనులు ఉంటే వెంటనే చేయించండి..ముందస్తు ప్రణాళికతో ముందుకు వెళ్లండి..పల్లెల్లో నీటి సరఫరా మరింత మెరుగు పరచండి’’ అని కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్షించారు. ఆర్‌డబ్ల్యూఎస్ వన్ యాప్, వాటర్ ట్రాన్స్‌పోర్టేషన్ రిపోర్టులను రోజూ అప్‌డేట్ చేయాలన్నారు. గ్రామాల వారీగా నీటి సరఫరాను పర్యవేక్షించాలన్నారు. నీటి కొరత ఉన్న చోట ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలన్నారు. అవసరమైతే ప్రైవేటు బోర్లను వినియోగించుకోవాలన్నారు. పైప్‌లైను, మోటర్లను వెంటనే మరమ్మత్తులు చేయించాలన్నారు. క్లోరినేషన్ ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలన్నారు. జిల్లాలో నిర్మాణంలో ఉన్న 271 కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్సులను పూర్తి చేయాలన్నారు. సమీక్షలో ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ మురళీధర్, గ్రామీణ నీటి పారుదల శాఖ అధికారులు, ఇంజినీర్లు పాల్గొన్నారు.
టన్ను మామిడి రూ.32 వేలు
అనంతపురం అగ్రికల్చర్: స్థానిక కక్కలపల్లి మార్కెట్‌లో శనివారం టన్ను మామిడి కాయలు గరిష్టంగా రూ.32 వేలు పలికినట్లు రాప్తాడు మార్కెట్ కమిటీ సెక్రటరీ రూప్‌కుమార్ తెలిపారు. మార్కెట్‌కు 358 టన్నుల మామిడికాయలు అమ్మకానికి రాగా, వాటిని వేలం వేశామన్నారు. అందులో బేనీషా రకం మామిడి టన్ను గరిష్టంగా రూ.32 వేలు, కనిష్టంగా రూ.20 వేల ప్రకారం ధర పలికాయన్నారు. తోతాపురి రకం టన్ను గరిష్టంగా రూ.30 వేలు, కనిష్టంగా రూ.15 వేలు పలికాయని, మల్లికా రకం టన్ను గరిష్టంగా రూ.25 వేలు, కనిష్టంగా రూ.10 వేల ప్రకారం ధర పలికినట్లు వెల్లడించారు.


