● భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు
జరగకుండా ఆరుగురిపై రౌడీషీట్
● ఇన్నోవా కారు, టూవీలర్,
ప్రామిసరీనోట్ల స్వాధీనం
● వివరాలు వెల్లడించిన
ధర్మవరం ఇన్‌చార్జ్ డీఎస్పీ నర్సింగప్ప
ధర్మవరం అర్బన్: భూ వివాదంలో రైతును కిడ్నాప్ చేసి దాడి చేసిన ఘటనలో ఆరుగురు కిడ్నాపర్లను రిమాండ్ పంపినట్లు ధర్మవరం ఇన్‌చార్జ్ డీఎస్పీ నర్సింగప్ప తెలిపారు. శనివారం ఆయన స్థానిక వన్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో విలేకరులతో మాట్లాడారు. భవిష్యత్తులో ఇలాంటి నేరాలకు పాల్పడకుండా ఆరుగురు కిడ్నాపర్లపై రౌడీషీట్ ఓపెన్ చేశామని తెలిపారు. 140(2), 308(5) ఆర్/డబ్ల్యూ 3(5) బీఎన్‌ఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని వెల్లడించారు. రైతు కిడ్నాప్..నిందితుల అరెస్టుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ వెల్లడించారు.
భూవివాదంలో కిడ్నాప్..
ముదిగుబ్బ మండలం కమ్మవారిపల్లి గ్రామానికి చెందిన రైతు ముసుగు నారాయణస్వామి 1997 సంవత్సరంలో అదే గ్రామానికి చెందిన కంద్యాల నారాయణతో 1.65 ఎకరాల భూమిని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అయితే కంద్యాల నారాయణ కుమారుడు కంద్యాల రవీంద్రనాయుడు మాత్రం ముసుగు నారాయణస్వామి కొనుగోలు చేసిన భూమిపై తనకు హక్కు ఉందంటూ నారాయణస్వామితో తరచూ గొడవపడేవాడు. ఈ భూ వివాదంపై ఆర్డీఓ కోర్టులో కేసు వేశారు. ఈనెల 8వ తేదీన ఆర్డీఓ కోర్టుకు రైతు ముసుగు నారాయణస్వామి రావడంతో కంద్యాల రవీంద్రనాయుడు, అతని కుమారుడు కంద్యాల అరుణ్‌కుమార్, అతని స్నేహితులు మార్కెట్‌వీధికి చెందిన నారా మధుసూదన్‌నాయుడు, వైఎస్సార్‌కాలనీకి చెందిన తులచూరి ప్రదీప్‌కుమార్, పోతుకుంట బీసీ కాలనీకి చెందిన పసుపులేటి ఉదయ్, బుక్కపట్నం మండలం యాదాలంకపల్లి గ్రామానికి చెందిన బిల్లే హరి ఆర్డీఓ కార్యాలయంలో ఉన్న రైతు నారాయణస్వామిని ఇన్నోవా కారులో కిడ్నాప్ చేశారు. మామిళ్లపల్లి మీదుగా రామగిరి మండలం శ్రీహరిపురం వద్దకు తీసుకెళ్లి రైతును విచక్షణారహితంగా కొట్టి గాయపరిచారు. ‘‘భూమి ఇస్తావా... లేక రూ.50 లక్షలు ఇస్తావా..ఏదో ఒకటి డిసైడ్ చేయకపోతే చంపేస్తాం’’ అని బెదిరించి ప్రాంసరీనోట్లపై బలవంతంగా సంతకాలు చేయించారు. రైతును కిడ్నాప్ చేశారన్న సమాచారం రాగానే ధర్మవరం వన్ టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్, ఎస్‌ఐ ఉమాదేవి అప్రమత్తాయరన్నారు. సిబ్బందితో కలిసి వెళ్లి శ్రీహరిపురం వద్ద కిడ్నాపర్లను అదుపులోకి తీసుకుని రైతును విడిపించారు. అలాగే కిడ్నాపర్ల నుంచి ఏపీ03బీయూ 1177 నంబరు గల ఇన్నోవా కారు, ఏపీ39 ఎల్‌వి 3446 నంబరు గల టూవీలర్, ఐదు ఖాళీ ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఆరుగురు కిడ్నాపర్లను కోర్టు ఎదుట హాజరు పరచగా, న్యాయమూర్తి వారికి రిమాండ్ విధించారు.


