పెనుకొండ రూరల్: ‘కియా’ అనుబంధ పరిశ్రమలో పని చేస్తున్న కార్మికుడు ప్రమాదవశాత్తూ మృతి చెందిన సంఘటన శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు... వైఎస్సార్ కడప జిల్లా అట్లూరి మండలం బోడిశెట్టిపల్లి గ్రామానికి చెందిన రామాంజనేయులు(22) ఆరు నెలలుగా ‘కియా’ అనుబంధ ఎన్వీహెచ్ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. ఎప్పటికలాగే శుక్రవారం రాత్రి విధులకు వెళ్లగా...పనిలో నిమగ్నమై ఉన్న సమయంలో ఉన్నట్టుండి భారీ యంత్రం తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. తోటి కార్మికులు రామాంజనేయులును హుటాహుటీన పెనుకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మృతి చెందినట్లు నిర్ధారించారు. కాగా, పరిశ్రమలోని ఆపరేటర్ అజాగ్రత్త వల్లే కార్మికుడు రామాంజనేయులు మృతి చెందినట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మృతుని తండ్రి లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ‘కియా’ ఎస్‌ఐ రాఘవయ్య తెలిపారు.
రూ.కోటి పరిహారం ఇవ్వాలి..
‘కియా’ అనుబంధ ఎన్వీహెచ్ పరిశ్రమలో పనిచేస్తూ మృతి చెందిన రామాంజనేయులు కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం వారు పట్టణంలోని పౌరసరఫరాలశాఖ గోడౌన్ వద్ద విలేకరులతో మాట్లాడారు. కార్మికులకు పరిశ్రమల్లో భద్రత లేకుండా పోతోందన్నారు. కార్మిక శాఖ అధికారులు కనీస చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైనా ప్రమాదం జరిగితే కార్మికుల ప్రాణాలమీదకు రాకుండా పరిశ్రమలలో అత్యాధునిక సెన్సార్ వంటి రక్షణ చర్యలు ఏర్పాటు చేయాలన్నారు. రామాంజనేయులు మృతి ఘటనలోనూ ఆ పరిశ్రమ నిర్లక్ష్యం చాలా ఉందన్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే తప్పించుకునే మార్గాలు కూడా చాలా కంపెనీల్లో లేవన్నారు. ఇప్పటికైనా కార్మిక శాఖ అధికారులు ఆయా కంపెనీల్లో తనిఖీలు చేయాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు బాబావలి, వెంకటరాముడు, నారాయణ, నాగభూషణ, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.
ప్రమాదవశాత్తూ ఫ్యాక్టరీలోనే దుర్మరణం


