నాడు–నేడు కింద సుందరంగా రూపుదిద్దుకున్న ఓడీ చెరువు
మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాల
పుట్టపర్తి: ప్రభుత్వ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించడమే లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ‘ప్రైవేట్’కు పెద్ద పీట వేస్తూ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను నిర్వీర్యం చేస్తోంది. గత జగన్ సర్కార్‌లో జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 1,45,000 మంది విద్యార్థులు ఉండగా, చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఆ సంఖ్య గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం 1,02,500 మంది విద్యార్థులు మిగిలారు. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతిలో చేరికలు పూర్తిగా పడిపోయాయి. 163 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా చేరలేదంటే ఎంతగా చతికిలబడ్డాయో అర్థం చేసుకోవచ్చు. పాఠశాలల పునఃప్రారంభానికి నెలు రోజులే మిగిలి ఉన్నా చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటి వరకు 1వ తరగతి ప్రవేశాల కోసం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. దీంతో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రయివేట్ పాఠశాలల్లో చేరుస్తున్నారు.
జగన్ హయాంలో మహర్దశ
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హయాంలో ప్రభుత్వ పాఠశాలలు ఓ వెలుగు వెలిగాయి. నాడు–నేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలే మారిపోయాయి. బడులన్నీ సుందరంగా రూపుదిద్దుకున్నాయి. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ‘అమ్మ ఒడి’ పథకం ప్రవేశపెట్టి ప్రతి విద్యార్థికీ రూ.15 వేలు అందజేశారు. క్రమం తప్పకుండా పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. ‘జగనన్న గోరుముద్ద’తో నాణ్యమైన భోజనం అందించారు. వేసవి సెలవుల్లోనూ విద్యార్థుల ఇంటి వద్దనే చిక్కీలు పంపిణీ చేసేలా చర్యలు చేపట్టారు. అప్పట్లో ప్రవేశ పెట్టిన సంస్కరణలతో ప్రభుత్వ పాఠశాలల్లో ‘నో న్యూ అడ్మిషన్’ బోర్డులు కనిపించా యంటే పరిస్థితి ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. కానీ, చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. రకరకాల కొర్రీలతో ‘తల్లికి వందనం’ లబ్ధిదారులను తగ్గించేశారు. కొత్త కొత్త నిబంధనలు తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తున్నారు.
సర్వత్రా ఆందోళన
చంద్రబాబు ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలు కూడా క్రమేపీ కనుమరుగువుతున్నాయి. జగన్ ప్రభుత్వ హయాంలో జిల్లాలో అన్ని ప్రభుత్వ పాఠశాలలు కలిపి 2,074 ఉండేవి. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే ప్రభుత్వ బడులపై నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రెండేళ్లలోనే చాలా పాఠశాలలు మూతపడ్డాయి. 2026–27 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ బడుల సంఖ్య 1,965కు పడిపోనుందనే ఆందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయాలతో రాబోవు రోజుల్లో పల్లెల్లో ప్రభుత్వ పాఠశాలలు కనుమరుగు కావడం ఖాయంగా కనిపిస్తోందని మేధావులు అభిప్రాయపడుతున్నారు.
సర్కారు బడులకు చంద్రగ్రహణం
163 పాఠశాలల్లో
ఒకటో తరగతి ప్రవేశాలు నిల్
కొత్త చేరికలపై ఎలాంటి చర్యలూ
తీసుకోని చంద్రబాబు ప్రభుత్వం
జగన్ ప్రభుత్వంలో వెలుగు వెలిగిన
ప్రభుత్వ బడులు
జిల్లాలో వివరాలిలా..
నియోజకవర్గం పేరు 1వ తరగతిలో విద్యార్థులు చేరని పాఠశాలల సంఖ్య
పుట్టపర్తి 25
ధర్మవరం 18
కదిరి 47
హిందూపురం 12
పెనుకొండ 18
మడకశిర 28
రాప్తాడు 15
మొత్తం 163
టీచర్లపైనా ఒత్తిడి..
చంద్రబాబు ప్రభుత్వం టీచర్లపైనా ఒత్తిడి పెంచు తోంది. సాధారణంగా పాఠశాలల ప్రారంభంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు గ్రామాల్లో ప్రతి ఇంటి వద్దకూ వెళ్లి విద్యార్థులను పాఠశాలలో చేర్చాలని కోరడం జరుగుతుంది. కానీ, చంద్రబాబు ప్రభుత్వం అందుకు భిన్నంగా శిక్షణలు, బదిలీల పేరుతో ఉపాధ్యాయులపై తీవ్రమైన ఒత్తిడి పెంచింది. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు చేరకుండా కావాలనే చంద్రబాబు ఇలా చేస్తోందని, ప్రభుత్వానికి కొమ్ముకాస్తున్న ప్రైవేటు విద్యా సంస్థలలో చేరే విధంగా పెద్ద కుట్రకు తెరలేపిందనే విమర్శలున్నాయి.


