అన్న క్యాంటీన్‌ సిబ్బంది కొడుతున్నారు | - | Sakshi
Sakshi News home page

అన్న క్యాంటీన్‌ సిబ్బంది కొడుతున్నారు

May 10 2026 9:46 AM | Updated on May 10 2026 9:46 AM

అన్నం తక్కువగా పెడుతున్నారన్నందుకు దాడి చేశారు

బాధితుల ఆవేదన సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌

ధర్మవరం: ‘అన్నం ఎందుకు తక్కువ పెడుతున్నారు. కూరలు కూడా నాసిరకంగా ఉన్నాయి’ అంటూ ప్రశ్నించినందుకు నిరుపేద కూలీలపై అన్న క్యాంటీన్‌ సిబ్బంది దాడి చేసిన ఘటన సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. క్యాంటీన్‌ సిబ్బందితో బాధితులు వాగ్వాదం చేస్తుండగా, కొందరు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. వివరాలు.. ధర్మవరంలోని ప్రభుత్వాసుపత్రి వద్ద ఉన్న అన్న క్యాంటీన్‌లో భోజనం చేసేందుకు ఇటీవల రాత్రి వేళ నిరుపేద కూలీలు వెళ్లారు. ఆహార పదార్థాలు నాసిరకంగా ఉండడంతో క్యాంటీన్‌ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అన్న క్యాంటీన్‌ నిర్వాహకుడు కూలీలపై రెచ్చిపోయాడు. కర్రతో దాడి చేసినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై అన్న క్యాంటీన్‌ సిబ్బందిని వివరణ కోరగా తాము ఎవరిపైనా దాడి చేయలేదన్నారు.

శభాష్‌ సాయిగౌతం

ఐఎఫ్‌ఎస్‌కు ఎంపికై న శ్రీ సత్యసాయి పాఠశాల పూర్వ విద్యార్థి

ప్రశాంతినిలయం: పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి హయ్యర్‌ సెకండరీ స్కూల్‌ పూర్వ విద్యార్థి కే.సాయిగౌతం ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ (ఐఎఫ్‌ఎస్‌)కు ఎంపికయ్యారు. దేశస్థాయిలో 113వ ర్యాంకు సాధించి పలువురి ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం ఆయన జిల్లాలో అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. సాయిగౌతం తండ్రి వినాయక ప్రసాద్‌ విద్యుత్‌ శాఖలో డీఈగా పని చేసి పదవీ విరమణ పొందారు. ఆయన తల్లి సుశీల గృహిణి కాగా సోదరుడు ప్రవీణ్‌ ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో ఆర్థోపెడిక్‌ సర్జన్‌గా పని చేస్తున్నారు. సాయి గౌతం యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ ఇంటర్వ్యూను 3 సార్లు, ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ ఇంటర్వ్యూను 3 సార్లు, ఏపీపీఎస్‌సీ గ్రూప్‌–1 ఇంటర్వ్యూను 3 సార్లు ఎదుర్కోవడం గమనార్హం. పట్టు వదలకుండా ప్రయత్నించిన ఆయన తాజాగా ఐఎఫ్‌ఎస్‌కు ఎంపికయ్యారు. 100 మందికి పైగా సివిల్‌ సర్వీసెస్‌ ర్యాంకర్లకు సాయి గౌతం మార్గదర్శనం చేయడం గమనార్హం.

చిన్నారిని మింగిన స్విమ్మింగ్‌ పూల్‌

పావగడ: స్విమ్మింగ్‌ పూల్‌లో మునిగి బాలుడు మృతి చెందిన ఘటన పావగడలో చోటు చేసుకుంది. వివరాలు.. పట్టణంలోని కన్మాన్‌ చెరువు వీధిలో నివసిస్తున్న రిజ్వాన్‌ కుమారుడు తాహిర్‌ (13) శనివారం స్థానిక వీరమ్మనహళ్లి గేటు వద్ద ఉన్న స్విమ్మింగ్‌ పూల్‌ వద్దకు వెళ్లాడు. ఈత కొట్టే క్రమంలో నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. కుమారుడి మృతదేహం వద్ద తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. పోలీసులు సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

విద్యాసంస్థల బస్సుల్లో తనిఖీలు ముమ్మరం

పుట్టపర్తి టౌన్‌: జిల్లాలోని అన్ని విద్యాసంస్థల బస్సులపై తనిఖీలు ముమ్మరం చేస్తున్నట్లు జిల్లా రవాణాశాఖ అధికారి కరుణసాగర్‌రెడ్డి తెలిపారు. శనివారం జిల్లా వ్యాప్తంగా స్కూల్‌బస్సుల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్సుల పరిశీలనకు ఐదు తనిఖీ బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిబంధనల ప్రకారం ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌, పర్మిట్‌, బీమా, డ్రైవర్‌ లైసెన్స్‌ వంటి పత్రాలతో పాటు లోపాలు, స్పీడ్‌ గవర్నర్‌లు, ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లు, అగ్నిమాపక సిలిండర్లు, ప్రథమ చికిత్స కిట్లు, ఫైర్‌ డిటెక్షన్‌పై ఆరా తీస్తున్నట్లు పేర్కొన్నారు. లోపాలు ఉంటే విద్యాసంస్థల యజమానులకు నోటీసులు జారీ చేసి గడువు లోపు సరిదిద్దుకోవాలని ఆదేశిస్తున్నట్లు వివరించారు.

మహిళపై టీడీపీ కార్యకర్తల దాడి

కనగానపల్లి: మండలంలోని కొండపల్లి గ్రామంలో ఎస్సీ కాలనీకి చెందిన మహిళపై స్థానిక టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. బాధిత మహిళ భూలక్ష్మి కనగానపల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. గ్రామానికి చెందిన తిప్పేస్వామి, అతని భార్య భూలక్ష్మి కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. దీంతో పాటు జీవనోపాధికి సొంతంగా ఒక ఆటో కూడా పెట్టుకున్నారు. రెండు రోజుల క్రితం ఆటోను వారి ఇంటి పక్కనే రోడ్డుపై నిలిపి ఉంచగా, స్థానిక కాలనీకి చెందిన టీడీపీ కారకర్తలు లక్ష్మిదేవి, ముత్యాలు, లక్ష్మేంద్ర, సుబ్బరాయుడు, రామలీలు వచ్చి రాజకీయ కక్షతో వీరితో గొడవకు దిగారు. తర్వాత భర్త తిప్పేస్వామి ఇంటి వద్ద లేని సమయంలో వచ్చి భూలక్ష్మిని విచక్షణారహితంగా కొట్టారు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమెను కుటుంబ సభ్యులు ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం అనంతపురం ఆస్పత్రికి తీసుకెళ్లారు. శనివారం బాధితురాలు కనగానపల్లి పోలీస్‌ స్టేషన్‌లో దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement