గ్రామాలకు అందని జలం | - | Sakshi
Sakshi News home page

గ్రామాలకు అందని జలం

May 10 2026 9:46 AM | Updated on May 10 2026 9:46 AM

బకాయి చిట్టాలో జీతం...

ఆత్మకూరు: ఉమ్మడి జిల్లాకు సత్యసాయి తాగునీటి ప్రాజెక్ట్‌ ఓ వరం. 1995లో ప్రజల దాహార్తిని గుర్తించిన సత్యసాయి బాబా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్‌కు జీవం పోశారు. 1997లో ఏపీ ప్రభుత్వానికి అప్పగించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ చిత్రావతి, పీఏబీఆర్‌ నుంచి నీటిని తీసుకుని శుద్ది చేసి ప్రత్యేక పైప్‌లైన్లు, సంపుల ద్వారా ఉమ్మడి అనంత పురం జిల్లాలోని 11 నియోజకవర్గాల పరిధిలో ఉన్న 870 గ్రామాలకు నీటిని అందజేస్తున్నారు. మహోన్నత ఆశయంతో నాడు సత్యసాయి ప్రారంభించిన ఈ పథకం కాస్త.. చంద్రబాబు ప్రభుత్వ తీరుతో నిర్వీర్యమైంది. సకాలంలో జీతాలు అందక రెండేళ్లుగా పలు దఫాలుగా కార్మికులు ఆందోళన బాట పడుతూ వచ్చారు. నిరవధిక సమ్మె చేపట్టిన ప్రతిసారీ ఎంతో కొంత చెల్లించడం... ఆ తర్వాత చేతులెత్తేస్తుండడంతో కార్మిక కుటుంబాలు అర్ధాకలితో అలమటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఐదు రోజుల క్రితం మరోసారి కార్మికులు విధులు బహిష్కరించి నిరవధిక సమ్మెలోకి వెళ్లారు. జీతాలు చెల్లించే వరకూ సమ్మె విరమించబోమంటూ భీష్మించారు.

ఒక్కో కార్మికుడికి రూ.లక్ష బకాయి

సత్యసాయి తాగునీటి ప్రాజెక్ట్‌లో భాగంగా ఉమ్మడి జిల్లా పరిధిలో 572 మంది కార్మికులు పనిచేస్తున్నారు. గత ఐదు నెలలుగా కార్మికులు జీతాలు అందడం లేదు. ఈ క్రమంలో కార్మికుడికి రూ.లక్ష వరకూ బకాయి పేరుకుపోయింది. దీంతో అప్పులు చేసి కుటుంబాలను పోషించుకోవాల్సి వస్తోందని కార్మికులు వాపోతున్నారు. కీలకమైన పండుగలు, పర్వదినాల్లోనూ చేతిలో చిల్లిగవ్వ లేకుండా కార్మిక కుటుంబాలు ఇబ్బంది పడ్డాయి. దీంతో తమ సమస్యకు పరిష్కారం చూపాలంటూ పలు దఫాలుగా ఆందోళనలు చేపట్టారు. అయినా ప్రభుత్వం కనీసంగానూ స్పందించలేదు. చివరకు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఐదు రోజుల క్రితం కార్మికులు విధులు బహిష్కరించి నిరవధిక సమ్మెలోకి వెళ్లిపోయారు. ఫలితంగా 870 గ్రామాలకు తాగునీరు అందకుండా పోయింది.

వేసవిలో ఎందుకింత నిర్లక్ష్యం?

తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భూగర్భ జలాలు అడుగంటాయి. వేసవిలో తాగునీటి కోసం తరచూ ఏదోక గ్రామంలో ప్రజలు ఖాళీ బిందెలతో నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇలాంటి తరుణంలో సత్యసాయి కార్మికుల దశల వారీ సమ్మెతో పది రోజులుగా గ్రామాల్లో నీరు అందకుండా పోయింది. ఐదు రోజులుగా చుక్క నీరు అందకపోవడంతో గ్రామాల్లో దాహం కేకలు మిన్నంటుతున్నాయి. వేసవిని దృష్టిలో ఉంచుకుని కార్మికులకు జీతాలు చెల్లించి సమస్యకు పరిష్కారం చూపాల్సిన ప్రభుత్వం ఇందుకు విరుద్ధంగా నిర్లక్ష్యం వహిస్తుండడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల ఇబ్బందులు అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోలేదంటూ పెద్ద ఎత్తున ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా కలెక్టర్‌ స్పందించి సత్యసాయి తాగునీటి పథకం కార్మికుల సమస్యలకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు.

ఐదు నెలలుగా సత్యసాయి తాగునీటి పథకం కార్మికులకు అందని జీతాలు

అప్పులతో కుటుంబాల పోషణ

ఐదు రోజులుగా నిరవధిక సమ్మెలో కార్మికులు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 870 గ్రామాల్లో నెలకొన్న తాగునీటి ఎద్దడి

ఉమ్మడి జిల్లాలో సత్యసాయి తాగునీటి ప్రాజెక్ట్‌ పరిధి

మొత్తం గ్రామాలు : 870

మొత్తం కార్మికులు : 572 మంది

జీతం బకాయిలు : ఐదు నెలలు

ఒక్కో కార్మికుడికి చెల్లించాల్సిన

బకాయి : రూ.లక్ష

Advertisement
 
Advertisement
Advertisement