మడకశిర: రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్ సీపీ పోరుబాట పట్టింది. శుక్రవారం మడకశిరలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ఈరలక్కప్ప, పార్టీ ఎస్‌ఈసీ సభ్యుడు వైసీ గోవర్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో వందలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు రైతులతో భారీ ర్యాలీ నిర్వహించి రణన్నినాదం చేశారు. రైతు సమస్యలను పరిష్కరించపోతే రాజీలేని పోరాటం చేస్తామన్నారు.
పట్టణంలో భారీ ర్యాలీ..
నియోజకవర్గంలోని 5 మండలాల నుంచి వందలాది మంది వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు రైతులతో కలిసి పట్టణంలోని వైఎస్సార్ సర్కిల్‌కు చేరుకున్నారు. అక్కడ వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. ర్యాలీలో చంద్రబాబు సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతు సమస్యలను పరిష్కరించాలని, పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, కృష్ణా జలాలు అందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం వద్దకు చేరుకుని ధర్నా చేపట్టారు.
రైతు సమస్యల పరిష్కారంలో
చంద్రబాబు సర్కార్ విఫలం..
రైతుల సమస్యలు పరిష్కరించడంలో చంద్రబాబు సర్కార్ పూర్తిగా విఫలమైందని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఈరలక్కప్ప, పార్టీ ఎస్‌ఈసీ సభ్యుడు వైసీ గోవర్దన్‌రెడ్డి అన్నారు. వరి, మొక్కజొన్న తదితర పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు నష్ట పోతున్నా.... చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మడకశిర ప్రాంతానికి కృష్ణా జలాలు అందించడంలో కూడా ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతులకు కూటమి ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదన్నారు. వైఎస్ జగన్ హయాంలో రైతులకు అనేక సంక్షేమ పథకాలు అందాయని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ఉచిత బీమా పథకాన్ని కూడా రద్దు చేసిందన్నారు. రైతు సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామన్నారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయ ఏఓకు వినతి పత్రాన్ని అందించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు నరసింహమూర్తి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి జీబీ శివకుమార్, మండల కన్వీనర్ శ్రీరాములు, పట్టణ కన్వీనర్ ఓంకుమార్, అగళి, గుడిబండ, రొళ్ల, అమరాపురం మండలాల కన్వీనర్లు శ్రీనివాస్, యంజారేగౌడ్, సంతోష్, త్రిలోక్‌నాథ్, పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర కార్యదర్శి నాగభూషణ్‌రెడ్డి, నాయకులు తిప్పేస్వామి, రంగనాథ్, తిమ్మారెడ్డి, శేషాద్రి, నరసింహ, మల్లికార్జున, లక్ష్మీనారాయణగౌడ్, సికిందర్, శివన్న, జయకుమార్, గోపి, అంజలి తదితరులు పాల్గొన్నారు.
రైతు సమస్యల పరిష్కారానికి
రోడ్డెక్కిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు
మడకశిరలో రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తల భారీ ర్యాలీ
కృష్ణానీరివ్వడంతో పాటు పంటలకు గిట్టుబాటుధర కల్పించాలని డిమాండ్
ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా.. చంద్రబాబు సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు
సర్కార్ స్పందించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామన్న నాయకులు


