‘ఉద్యాన పాలిటెక్నిక్‌’ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ | - | Sakshi
Sakshi News home page

‘ఉద్యాన పాలిటెక్నిక్‌’ ప్రవేశాలకు నోటిఫికేషన్‌

May 9 2026 7:26 AM | Updated on May 9 2026 7:26 AM

మడకశిర రూరల్‌: డాక్టర్‌ వైఎస్సార్‌ ప్రభుత్వ ఉద్యాన విశ్వ విద్యాలయం పరిధిలోని కళాశాలల్లో ఉద్యాన, ల్యాండ్‌ స్కేపింగ్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. 2026–2027 విద్యా సంవత్సరానికిగాను ఉద్యాన పాలిటెక్నిక్‌లో ప్రవేశాలకు పదో తరగతి ఉత్తీర్ణులైన లేదా తత్సమాన తరగతుల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని స్థానిక ప్రభుత్వ ఉద్యాన పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ బయ్యన్న శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 9వ తేదీ (శుక్రవారం) నుంచి 23వ తేదీలోపు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఆసక్తి కలిగిన వారు https:// drysrhu.ap.gov.in వెబ్‌సైట్‌ చూడాలన్నారు. మడకశిర ఉద్యాన పాలిటెక్నిక్‌ కళాశాలకు ప్రభుత్వం 60 సీట్లు కేటాయించిందన్నారు. పూర్తి వివరాల కోసం 7382633687, 9182677322, 9492328008 నంబర్లలో సంప్రదించాలన్నారు.

14వ శతాబ్దం నాటి ఆలయం గుర్తింపు

పుట్టపర్తి: బుక్కపట్నం గ్రామానికి దక్షిణాన ఉన్న నల్లకొండ మీద ఉన్న తిరుమల దేవర ఆలయం 14వ శతాబ్దానికి చెందినదిగా గుర్తించినట్లు చరిత్రకారుడు బుక్కపట్నం గోపి తెలిపారు. వివరాలను శుక్రవారం ఆయన వెల్లడించారు. ఈ ఆలయానికి తూర్పు, ఉత్తర ద్వారాలతో పాటు దక్షిణ మార్గం కూడా ఉందన్నారు. గుప్త నిధుల తవ్వకాల కారణంగా ఆలయం శిథిలావస్థకు చేరుకుందన్నారు. ఇదే కొండపై విజయనగర రాజులు నిర్మించిన సైనిక పహారా బురుజు, నీటి తొట్టె ఉన్నాయన్నారు. తిరుమల దేవర ఆలయంతో పాటు అహోబిలేశ్వర ఆలయం, అక్క దేవతల ఆలయాలను కలుపుతూ రహదారి ఏర్పాటు చేస్తే నల్లకొండ పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

వేడుకగా ధ్వజ అవరోహణం

ఉరవకొండ రూరల్‌: ప్రసిద్ధి చెందిన పెన్నహోబిలం లక్ష్మీ నృసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ధ్వజ అవరోహణ కార్యక్రమం నిర్వహించారు. వేద పండితులు ముక్కోటి దేవతలకు వేదమంత్రాలతో పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత నృసింహస్వామి శయనోత్సవాన్ని అర్చకులు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ఈఓ సాకే రమేష్‌ బాబు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

‘ఇన్‌స్టా’లో ప్రేమ..

పెళ్లికి నిరాకరణ

అనంతపురం సెంట్రల్‌: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచడం ప్రేమగా మారింది. మూడేళ్లుగా ప్రేమాయణం సాగించిన యువకుడు... పెళ్లి పేరు ఎత్తగానే ‘నో’ అనేశాడు. దీంతో యువతి పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళితే.. అనంతపురానికి చెందిన ఓ యువతికి తెలంగాణలోని కరీంనగర్‌ నివాసి, డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న పర్వేజ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పరిచయమయ్యాడు. తరచూ చాటింగ్‌ చేసుకునేవారు. ఈ క్రమంలో నువ్వంటే నాకిష్టమంటూ ఒకరినొకరు చెప్పుకున్నారు. పలు దఫాలు ప్రత్యక్షంగా కలుసుకుని మాట్లాడుకున్నారు. ఈ నేపథ్యంలో పెళ్లి చేసుకుందామంటూ కొన్ని రోజులుగా యువతి అభ్యర్థిస్తూ వచ్చింది. ఈ అభ్యర్థనను సదరు యువకుడు తిరస్కరిస్తూ రావడంతో చివరకు అనంతపురం వన్‌టౌన్‌ పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలో దిగిన పోలీసులు కరీంనగర్‌ నుంచి పర్వేజ్‌ను రప్పించుకుని మాట్లాడారు. కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అయినా ససేమిరా అనడంతో చివరకు కేసు నమోదు చేసి, శుక్రవారం రిమాండ్‌కు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement