కిరణ్‌కుమార్‌కు ఆ అర్హత లేదు | - | Sakshi
Sakshi News home page

కిరణ్‌కుమార్‌కు ఆ అర్హత లేదు

May 9 2026 7:26 AM | Updated on May 9 2026 7:26 AM

కదిరి: ‘‘కిరణ్‌కుమార్‌కు మన్సిపల్‌ కమిషనర్‌గా ఉండే అర్హత లేదు. హార్టికల్చర్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఉన్న ఆయన్ను నిబంధనలకు విరుద్ధంగా మళ్లీ కదిరి కమిషనర్‌గా కొనసాగిస్తూ ఆదేశాలిస్తే హార్టికల్చర్‌ శాఖ అభ్యంతరం చెప్పాలి. సెలక్షన్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీ కమిషనర్‌గా హార్టికల్చర్‌ ఏడీని నియమించడం సరికాదు. ఆయన డిప్యుటేషన్‌ కూడా చెల్లదు’’ అంటూ హైకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. కదిరి మున్సిపల్‌ కమిషనర్‌గా కిరణ్‌కుమార్‌ను నిబంధనలకు విరుద్ధంగా నియమించారని, ఆయన నియామకాన్ని రద్దు చేయాలని గతంలోనే శివశంకర్‌ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఆ పిటిషన్‌ శుక్రవారం విచారణకు రాగా, న్యాయమూర్తి వి.సుజాత కీలక వ్యాఖ్యలు చేశారు. హార్టికల్చర్‌ ఏడీగా ఉన్న కిరణ్‌కుమార్‌ను డిప్యుటేషన్‌పై కదిరి మున్సిపల్‌ కమిషనర్‌గా నియమించడం సరికాదని అభిప్రాయపడ్డారు. కదిరి మున్సిపాలిటీలో ఈయన హయాంలో జరిగిన అవినీతిపై వచ్చిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకొని విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. అలాగే కిరణ్‌కుమార్‌ అదనంగా పొందిన జీత భత్యాలను సైతం తిరిగి రాబట్టాలని ఆదేశించారు. ఒకవేళ మళ్లీ ఆయననే కదిరి మున్సిపల్‌ కమిషనర్‌గా నియమిస్తే హైకోర్టు తలుపు తట్టవచ్చని పిటిషనర్‌ శివశంకర్‌కు హైకోర్టు న్యాయమూర్తి సూచించారు. కాగా, ఇప్పటికే కిరణ్‌కుమార్‌ను కదిరి కమిషనర్‌ బాధ్యతలనుంచి తప్పించి, మాతృశాఖకు పంపించేశారని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు.

కొత్త కమిషనర్‌గా అజయ్‌?

కదిరి మున్సిపల్‌ కమిషర్‌గా ఉన్న కిరణ్‌కుమార్‌ను తప్పించి ఆయన స్థానంలో ఇక్కడే ఏఈగా ఉన్న సందీప్‌కు కమిషనర్‌గా పూర్తి స్థాయి బాధ్యతలు ఇస్తూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. తనకు ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్‌ అండదండలున్నాయని, మళ్లీ తానే కమిషనర్‌గా వస్తానని కిరణ్‌కుమార్‌ ధీమాగా ఉన్నా.. హైకోర్టు ఆదేశాలతో ఆయన ఇక్కడ తట్టా, బుట్టా సర్దుకోవాల్సిందే. కాగా కొత్త కమిషనర్‌గా ఆడిట్‌ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఉన్న అజయ్‌ కుమార్‌ రావచ్చని విశ్వసనీయ సమాచారం.

కదిరి మున్సిపల్‌ కమిషనర్‌ విషయంలో హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణకు ఆదేశం

కిరణ్‌నే మళ్లీ నియమిస్తే కోర్టు తలుపు తట్టాలని పిటిషనర్‌కు సూచన

Advertisement
 
Advertisement
Advertisement