అనంతపురం సెంట్రల్: సీసీ రోడ్డు నిర్మాణానికి ఎంబుక్‌లను ప్రాసెస్ చేసి బిల్లు మంజూరు చేయడానికి లంచం తీసుకున్న కేసులో పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ బండారు చిన్నపుల్లయ్యకు కర్నూలు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి శ్రీవిద్య ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.2 లక్షల జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు వెలువరించారు. వివరాలు... 2018 సంవత్సరంలో అమడగూరు మండలం సీతిరెడ్డిపల్లిలో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. అయితే ఎంబుక్‌లను ప్రాసెస్ చేసి బిల్లుల మంజూరుకు అప్పటి పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ చిన్నపుల్లయ్య (ప్రస్తుతం రిటైర్డ్) రూ.20 వేలు లంచం డిమాండ్ చేశారు. బాధితుడు వెంకటనారాయణపల్లికి చెందిన లక్ష్మీపతి 2018 అక్టోబర్ 8న అనంతపురం ఏసీబీ డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. లంచం తీసుకుంటుండగా చిన్న పుల్లయ్యను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. కేసు విచారణ అనంతరం కర్నూలు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి శ్రీవిద్య తీర్పు వెలువరించారు. చిన్నపుల్లయ్యకు ఏడు సంవత్సరాల కఠిన కారాగారశిక్ష, రూ.2 లక్షల జరిమానా విధించారు. జరిమానా డబ్బులు చెల్లించలేకపోతే అదనంగా 6 నెలలు సాధారణ జైలు శిక్ష అనుభవించాలన్నారు. జరిమానా మొత్తంలో రూ.2 లక్షలను ఫిర్యాదుదారునికి నష్టపరిహారంగా చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. అనంతరం ముద్దాయిని కర్నూలు శివారులోని జిల్లా జైలుకు తరలించారు.


