‘ప్రభుత్వం మాది. ఇక్కడ మేము ఏమి చేసినా చెల్లుతుంది. దమ్ముంటే మమ్మల్ని అడ్డుకోండి.. చూద్దాం’ అంటూ అధికారులకే సవాల్ విసురుతున్నారు కొందరు టీడీపీ నేతలు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి జిల్లాలో నెలకొన్న పరిస్థితి ఇది. అధికారాన్ని అడ్డు పెట్టుకుని వారు సాగిస్తున్న ఆకృత్యాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. సహజ వనరులపై కన్నేసిన వారు చెరువులు, వాగులు, వంకలతో పాటు చివరకు ప్రభుత్వ భూముల్లోని ఎర్రమట్టినీ వదలడం లేదు. రాప్తాడు నియోజకవర్గంలో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉంది.
రాప్తాడు రూరల్: అనంతపురం రూరల్ మండలంలో సహజ వనరుల దోపిడీ రోజురోజుకూ పెచ్చుమీరుతోంది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన ఈ రెండేల్లలో చియ్యేడు, పూలకుంట, మన్నీల, కృష్ణమరెడ్డిపల్లి ప్రాంతాల నుంచి భారీగా గ్రావెల్, ఎర్రమట్టిని అక్రమంగా తరలిస్తున్నా సంబంధిత శాఖల అధికారులు అడ్డుకోలేకపోతుండడం విమర్శలకు తావిస్తోంది. ప్రజల ఆస్తిగా భావించాల్సిన సహజ వనరులను చేజిక్కించుకున్న కొందరు.. వాటిని రూ.కోట్ల విలువైన అక్రమ వ్యాపారంగా మార్చేశారు.
స్థానికుల ఫిర్యాదులు బుట్టదాఖలు
గతం నుంచి సహజ వనరుల దోపిడీనే ఆదాయ వనరుగా మార్చుకున్న టీడీపీ నేతలు.. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఐదేళ్లూ కిమ్మనకుండా ఉండిపోయారని, తిరిగి చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్రమ తవ్వకాలు పెరిగిపోయాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. తాము చేసిన ఫిర్యాదులు కాస్త బుట్టదాఖలవుతున్నాయని అంటున్నారు. రేయింబవళ్లు టిప్పర్లతో గ్రావెల్, ఎర్రమట్టిని తరలిస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూగర్భ గనుల శాఖ అధికారులు నామమాత్రపు తనిఖీలతో చిన్నపాటి జరిమానాలు విధిస్తూ చేతులు దులుపుకుంటున్నారని మండిపడుతున్నారు.
ప్రభుత్వ భూమినీ వదలని వైనం
తాజాగా రెండు రోజుల క్రితం కృష్ణమరెడ్డిపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 90/3 లో జగనన్న కాలనీకి కేటాయించిన స్థలంలో అక్రమంగా మట్టిని తవ్వడం కలకలం రేపుతోంది. ప్రభుత్వ అవసరాల కోసం కేటాయించిన స్థలంలో మట్టిని తవ్వి, ఇటుకలపల్లి సమీపంలో డంప్ చేసి అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ వ్యవహారంలోని ప్రధాన సూత్రధారులు తమ వెనుక రాప్తాడు నియోజకవర్గానికి చెందిన కొందరు ముఖ్య నాయకులు ఉన్నారంటూ వారి పేర్లు చెబుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో గ్రామస్తులు కూడా బహిరంగంగా మాట్లాడలేకపోతున్నారు. కృష్ణమరెడ్డిపల్లికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఈ మట్టితరలింపు వ్యవహారంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లుగా సమాచారం. పోలీసులు, విజిలెన్స్, భూగర్భ గనుల శాఖ అధికారుల నుంచి కఠిన చర్యలు లేకపోవడంతో మరింత రెచ్చిపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గ్రావెల్, ఎర్ర మట్టి అక్రమ తవ్వకాలపై ప్రత్యేక దర్యాప్తు నిర్వహించాలని, బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి యథేచ్చగా సహజ వనరుల దోపిడీ
టీడీపీ నేతల ఒత్తిళ్లతో అటుగా కన్నెత్తి చూడని అధికారులు
ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తిన సమయంలో నామమాత్రపు చర్యలు


