పుట్టపర్తి టౌన్: రోడ్డు నిర్మాణ పనుల్లో గతంలో ఎన్నడూ లేని కొత్త సంస్కృతికి కాంట్రాక్టర్ శ్రీకారం చుట్టాడు. దీనికి రోడ్లు భవనాల శాఖ అధికారులు వత్తాసు పలికారు. సాధారణంగా రోడ్డు నిర్మించాక రెన్యువల్ పనులు ఐదేళ్ల పాటు చేస్తారు. ఈ క్రమంలో పాత రోడ్డు మీద తారు, బిటుమిన్‌తో కొత్త లేయర్ వేస్తుంటారు. అయితే పుట్టపర్తిలో మాత్రం ఇందుకు విరుద్ధంగా పనులు సాగుతున్నాయి. గత ఏడాది నవంబర్‌లో వేసిన రోడ్డును పూర్తిగా పెకలించి అవశేషాలను పక్కన పరుస్తూ మధ్యలో కొత్తగా రోడ్డు నిర్మాణం చేపట్టారు. వాస్తవానికి కొత్తగా వేసిన రోడ్డుకు పక్కన గ్రావెల్ పరిచి చదును చేయాల్సి ఉండగా ఇందుకు విరుద్ధంగా కాంట్రాక్టర్ చేపట్టిన పనులను అధికారులు చూస్తూ మిన్నకుండి పోయారు.
పట్టుమని ఏడు నెలలు తిరక్కుండానే
భగవాన్ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా గత ఏడాది నవంబర్‌లో రూ.2.20 కోట్ల వ్యయంతో సత్యసాయి సూపర్ ఆస్పత్రి నుంచి బ్రాహ్మణపల్లి, ఎనుములపల్లి క్రాస్ మీదుగా గణేష్ కూడలి వరకూ తారు రోడ్డు వేసే పనిని ఓ కాంట్రాక్టర్‌కు రోడ్లు భవనాల శాఖ అప్పగించింది. ఈ పనులు కొద్ది మేర మిగిలి ఉన్నాయి. ఇక్కడ వరకూ అంతా బాగున్నా... ఈ నెల 15న పుట్టపర్తిలో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు పర్యటించనున్న నేపథ్యంలో ఈ మార్గంలో మరోసారి తారు రోడ్డు వేసేందుకు అధికారుల నుంచి ఒత్తిళ్లు మొదలు కావడంతో కాంట్రాక్టర్ హడావుడిగా పనులు చేపట్టాడు. కొత్త రోడ్డు వేసే క్రమంలో పాత రోడ్డును పిక్కింగ్ చేయాల్సి ఉండగా ఇందుకు విరుద్ధంగా మొత్తం తారు రోడ్డును పెకలించేశాడు. అనంతరం దానిని ముక్కలుగా చేసి కొత్త రోడ్డుకు పక్కగా పరిచేశాడు. వాస్తవానికి వాహనాలు దిగి, ఎక్కేందుకు వీలుగా కొత్త రోడ్డు ఎత్తుకు సరిపడేలా గ్రావెల్ పరచాల్సి ఉంది. ఇందుకు విరుద్ధంగా తారు కంకర ముక్కలు పరిచేయడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఖర్చు తగ్గించుకునే క్రమంలో కాంట్రాక్టర్ పెడదారి పట్టినా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి నూతన రోడ్డుకు ఇరువైపులా గ్రావెల్ వేసి చదను చేయించాలని స్థానికులు కోరుతున్నారు.
కొత్త రోడ్డు నిర్మాణంలో పాత రోడ్డు అవశేషాలు
నిబంధనలకు విరుద్ఢంగా పనులు
కాంట్రాక్టర్ పనితీరుపై అవాక్కవుతున్న ప్రజలు


