విద్యుదాఘాతంతో డ్రైవర్‌ మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో డ్రైవర్‌ మృతి

May 9 2026 7:26 AM | Updated on May 9 2026 7:26 AM

గోరంట్ల: విద్యుత్‌ షాక్‌కు గురై తమిళనాడుకు చెందిన కంటైనర్‌ డ్రైవర్‌ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. పాలసముద్రం నుంచి కదిరి వైపుగా ఖాళీగా శుక్రవారం బయలుదేరిన కంటైనర్‌ గోరంట్ల సమీపంలోకి చేరుకోగానే ఏఎన్‌కే డిగ్రీ కళాశాల వద్ద రోడ్డు పక్కన ఆపేందుకు డ్రైవర్‌ ప్రయత్నించాడు. ఆ సమయంలో పైనున్న విద్యుత్‌ తీగలు తగిలి కంటైనర్‌కు విద్యుత్‌ ప్రసరించి మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు కేకలు వేయడంతో డ్రైవర్‌ వెంటనే కిందకు దిగి కాలుతున్న టైర్లపై నీరు చల్లే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో విద్యుత్‌ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. లభ్యమైన ఆధారాలను బట్టి మృతుడిని తమిళనాడుకు చెందిన ప్రదీప్‌ (27)గా నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

చోరీ కేసుల్లో

నిందితుడికి రిమాండ్‌

గాండ్లపెంట: మండలంలోని కటారుపల్లిలో వెలసిన గంగమ్మ ఆలయం, సాదులవాండ్లపల్లిలోని బొగాదమ్మ ఆలయంలో చొరబడి హుండీలోని భక్తుల కానుకలను అపహరించిన కేసులో నిందితుడు కరుణాకర్‌రెడ్డిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ సుమతి తెలిపారు. తలుపుల మండలం మామిళ్లపల్లికి చెందిన కరుణాకర్‌రెడ్డి.. ఈ నెల 1న రెండు ఆలయాల్లోనూ చోరీలకు పాల్పడినట్లు వివరించారు. ఆయా ఘటనలపై కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా పక్కా ఆధారాలు సేకరించి శుక్రవారం కదిరిలోని కోర్టు రోడ్డులో తచ్చాడుతున్న నిందితుడిని అరెస్ట్‌ చేసి, న్యాయమూర్తి ఆదేశాలతో రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

పాము కాటుతో రైతు మృతి

కనగానపల్లి: మండలంలోని తల్లిమడుగుల గ్రామానికి చెందిన రైతు ఈడిగ వన్నూరప్ప (53) పాముకాటుకు గురై మృతి చెందాడు. ఆయనకు భార్య యల్లమ్మ, ఓ కుమారుడు ఉన్నారు. శుక్రవారం తెల్లవారుజామున పంటకు నీరు పెట్టేందుకు వెళ్లిన ఆయన పొలం గట్టుపై తిరుగుతుండగా పాము కాటేసింది. ఆ సమయంలో తన కాలికి ఏదో గుచ్చుకుందని భావించిన ఆయన ఇంటికి వెళ్లిపోయాడు. కాసేపటి తర్వాత నోటి నుంచి బురుగు వస్తుండడంత గమనించిన కుటుంబసభ్యులు ఆగమేఘాలపై ధర్మవరంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు పాము కాటుతో అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.

చైన్‌ స్నాచర్‌ అరెస్ట్‌

శింగనమల(నార్పల): ఈ నెల 5న నార్పలలోని సుల్తాన్‌పేటలో చైన్‌స్నాచింగ్‌కు పాల్పడిన బ్రహ్మసముద్రం మండలం రాయలప్పదొడ్డికి చెందిన రాయల తరేష్‌ని అరెస్ట్‌ చేసి, రిమాండ్‌కు తరలించినట్లు నార్పల పీఎస్‌ ఎస్‌ఐ సాగర్‌ తెలిపారు. వివరాలను శుక్రవారం ఆయన వెల్లడించారు. ఒంటరిగా వెళుతున్న మహిళలకు కత్తి చూపి బెదిరించి, వారి మెడలోని బంగారు గొలుసులను లాక్కొని ఉడాయించేవాడు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 5న సుల్తాన్‌పేటలో ఒంటరిగా వెళుతున్న నంద్యాల నరసమ్మ మెడలోని బంగారు గొలుసు లాక్కొని ఉడాయించాడు. ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు పక్కా ఆధారాలతో శుక్రవారం నిందితుడిని అదుపులోకి తీసుకుని బంగారు గొలుసు, ద్విచక్ర వాహనం, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement