పరిగి: మండలంలోని శీగిపల్లికి చెందిన ఈడిగ శ్రీనివాసులు(40) ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామనికి చెందిన బోయ అనితను 2007లో కులాంతర వివాహం చేసుకున్నాడు. ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబసభ్యులు తెలిపిన మేరకు... వివాహం అనంతరం శ్రీనివాసులు తన భార్యతో కలిసి బెంగళూరులో నివాసముంటూ అక్కడే పెయింటింగ్ పనులతో జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల దంపతుల మధ్య మనస్పర్థలు చోటు చేసుకుని తరచూ గొడవపడేవారు. దీంతో శ్రీనివాసులు మద్యానికి బానిసయ్యాడు. ఈ నెల 3న దంపతులిద్దరూ శీగిపల్లికి వచ్చారు. అదే రోజు అనిత బెంగళూరుకు తిరిగి వెళ్లింది. గురువారం రాత్రి భోజనం అనంతరం ఇంటి పైనున్న గదిలో పడుకుంటానంటూ కుటుంబసభ్యులకు తెలిపి శ్రీనివాసులు వెళ్లాడు. శుక్రవారం ఉదయం 10 గంటలైనా కిందకు దిగి రాకపోవడంతో తల్లి వెళ్లి తలుపు తట్టింది. ఎలాంటి స్పందన లేకపోవడంతో కిటికీలో నుంచి చూసింది. అప్పటికే లుంగీతో ఫ్యాన్‌కు వేసుకున్న ఉరికి విగతజీవిగా వేలాడుతున్న కుమారుడిని చూసి గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి తల్లి ఈడిగ రత్నమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.


