కనగానపల్లి: గతంలో ఎన్నడూ లేనంతగా జిల్లాలో ఈ వేసవిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలకు మనుషులతో పాటు మూగజీవాలూ విలవిలలాడుతున్నాయి. రోజంతా మెట్ట భూముల్లో తిరుగుతూ మేత మేసే గొర్రెలు ఎండ వేడిమికి తాళలేకపోతున్నాయి. దీంతో మధ్యాహ్నాం ఒంటి గంట దాటిందంటే ఎండలో ఉండలేక చెట్ల నీడన చేరుతున్నాయి. ఎండ వేడిమి తాళలేక చిన్న గొర్రె పిల్లలు మృత్యువాత పడుతున్నాయి. రాప్తాడు నియోజక వర్గంలో నాలుగు లక్షల పైగా గొర్రెలు ఉండగా, ఒక్క కనగానపల్లి మండలంలోనే అత్యధికంగా 1.35 లక్షల గొర్రెలు ఉన్నాయి. మండలంలోని పర్వతదేవరపల్లి, మామిళ్లపల్లి, కనగానపల్లి, కోనాపురం, ఎలకుంట్ల, నరసంపల్లి, కేఎన్ పాళ్యం గ్రామాలలో గొర్రెల పోషణతో జీవించేవారు ఎక్కువగా ఉన్నారు.
వడదెబ్బ ప్రభావంతో..
ప్రస్తుత వేసవిలో పగటి పూట 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఎండ వేడిమిని తట్టుకోలేక చాలా గ్రామాల్లో గొర్రె పిల్లలు మృత్యువాత పడుతున్నాయి. ఎండ వేడిమికి గొర్రె పిల్లలు వడదెబ్బకు గురై మృతి చెందుతున్నాయని కాపరులు భాస్కరగౌడ్, జ్యోతప్ప, ఓబులేసు, నరసింహులు అంటున్నారు. ఎండ వేడిమి నుంచి జీవాలను కాపాడేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేదని వాపోతున్నారు. ఒక మందలో రోజుకు ఒకటి, రెండు జీవాలు వడ దెబ్బ సోకి చనిపోతున్నాయన్నారు. పర్వతదేవపల్లి, మామిళ్లపల్లి, కనగానపల్లి గ్రామాల్లో 30 రోజుల వ్యవధిలోనే వందకు పైగా గొర్రె పిల్లలు మృతి చెందినట్లు కాపరులు తెలిపారు. మధ్యాహ్నా సమయంలో ఎండ వేడిమి తాళలేక గొర్రెలను చెట్ల నీడనే చేర్చాల్సి వస్తోందని, అయితే వందలాది జీవాలకు ఒకేచోట నీడనిచ్చే చెట్లు దొరకాలంటే కష్టంగా ఉందంటున్నారు. అలాగే వేసవిలో నీటి ఎద్దడి కూడా ఎక్కువగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాభావ పరిస్థితులతో భూగర్భ జలాలు అడుగంటి వ్యవసాయ బోరుబావుల్లో నీటి లభ్యత తగ్గిందని, దీంతో రైతులు నీటిని బయటకు వదలడం లేదని అంటున్నారు.
మృత్యువాత పడుతున్న గొర్రె పిల్లలు
భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఎండలు మండిపోతున్నాయి. దీంతో మనుషులే కాదు.. మూగ జీవాలూ విలవిల్లాడిపోతున్నాయి. పెరిగిన వేసవి తాపంతో పశు, పక్షులు అల్లాడిపోతున్నాయి. చల్లని ప్రదేశాలను వెతుక్కుంటూ రక్షణ పొందే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎండ వేడిమి తట్టుకోలేక కొన్ని.. నీళ్లు లేక గొంతెండి మరికొన్ని పక్షులు నేలరాలుతున్నాయి.. జీవాలు మృత్యువాతపడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా నోరు లేని మూగజీవాల వేసవి కష్టాలు వర్ణనాతీతంగా మారాయి.


