అమరాపురం: మండలంలోని తమ్మిడేపల్లిలో నెలకొన్ని తాగునీటి సమస్యను అధికారులు పరిష్కరించారు. కొన్ని రోజులుగా తాగునీరు అందకపోవడంతో స్థానికులు బుధవారం సచివాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ అంశం ‘ప్రజల కష్టాలు పట్టని మారాజు’ శీర్షికన గురువారం ‘సాక్షి’లో కథనం వెలువడింది. దీనిపై స్పందించిన పంచాయతీ కార్యదర్శి యోగానంద గురువారం ఉదయం రాజీవ్‌నగర్‌కు వెళ్లి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. వాటర్‌మెన్‌ను పిలిపించుకుని బోరుబావి వద్ద నెలకొన్న సమస్యను పరిష్కరించి కుళాయిల ద్వారా నీటి సరఫరాను పునరుద్ధరించారు. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపారు.
ఆర్టీసీ ఆర్థికాభివృద్ధికి కృషి చేయాలి : డీపీటీఓ
పుట్టపర్తి టౌన్: ఆదాయ మార్గాలు అన్వేషించి జిల్లాలో ఆర్టీసీని లాభాల బాటలోకి తీసుకెళ్లడానికి కృషి చేద్దామని ఉద్యోగులకు డీపీటీఓ మధుసూదన్ పిలుపునిచ్చారు. జిల్లాలోని ఆర్టీపీ డిపో మేనేజర్లు, ట్రాఫిక్, గ్యారేజ్, పర్సనల్, అకౌంట్ డిపార్టుమెంట్ సూపర్‌వైజర్లతో గురువారం తన కార్యాలయంలో ఆయన సమావేశమై మాట్లాడారు. ప్రతి బస్సు రూటును సూపర్‌వైజర్లు పరిశీలించాలన్నారు. సెక్టార్ వారీగా పనితీరు బాగాలేని సర్వీసులను రీసెట్ చేయాలన్నారు. ప్రమాదాలు జరగకుండా డ్రైవర్లకు కండెక్టర్లకు, గ్యారేజ్ సిబ్బందికి అవగాహన కల్పించాలన్నారు. ప్రతి స్టేజ్‌లోనూ బస్సులు సక్రమంగా ఆపి ప్రయాణికులను ఎక్కించుకోవాలని, స్టేజ్‌ల్లో బస్సులు ఆపలేదని ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు అందితే కఠిన చర్యలు తప్పనవి హెచ్చరించారు. దివ్యాంగులకు కేటాయించిన సీట్లలో వారిని కూర్చొనేలా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని బస్టాండ్లలో తాగునీరు, శుభ్రమైన టాయిలెట్లు, ప్రయాణికులకు కుర్చీలు, ఫ్యాన్లు, చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాలని మేనేజర్లను ఆదేశించారు.
అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
తుమకూరు: తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను అరెస్ట్ చేసినట్లు కర్ణాటకలోని తుమకూరు జిల్లా పోలీసులు వెల్లడించారు. గురువారం మధుగిరి తాలూకా కొడిగెనహళ్లి పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలను ఎస్‌ఐ రాజేష్ వెల్లడించారు. కొడిగెనలహళ్లి హోబలి జి.హోసహళ్లి గ్రామానికి చెందిన రామకృష్ణప్ప ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇంటికి తాళం వేసి కుటుంబసభ్యులతో కలసి సమీప బంధువు ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో తాళం బద్ధలుగొట్టి లోపలకు ప్రవేశించిన దుండగుడు బీరువాలో ఉన్న 37 గ్రాముల బంగారు నగలను అపహరించుకెళ్లాడు. ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు కొడిగెనహళ్లి పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా పక్కా ఆధారాలు సేకరించిన పోలీసులు గురువారం శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం పట్టణానికి చెందిన నరసింహమూర్తిని అరెస్ట్ చేసి, విచారణ చేస్తున్నారు.
అశ్వ వాహనంపై శ్రీవారు
ఉరవకొండ రూరల్: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిలం లక్ష్మీ నృసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం దేవేరులతో కలిసి అశ్వ వాహనంపై భక్తులకు శ్రీవారు దర్శనమిచ్చారు. ఉదయం మూలవిరాట్‌కు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు పెద్ద ఎత్తున సాగాయి. సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత నృసింహస్వామి ఉత్సవ మూర్తులను అశ్వ వాహనంపై కొలువు దీర్చి ఆలయం చుట్టూ ఊరేగించారు. కార్యక్రమానికి ఉరవకొండకు చెందిన అంగదాల నారాయణస్వామి, అంగదాల ఆంజనేయులు, అంగదాల అభినయ్, గాజుల నాగరాజు ఉభయదాతలుగా వ్యవహరించారు.


