మంచం పట్టిన పెద్దిరెడ్డిపల్లి | - | Sakshi
Sakshi News home page

మంచం పట్టిన పెద్దిరెడ్డిపల్లి

May 8 2026 9:44 AM | Updated on May 8 2026 9:44 AM

పరిగి: మండలంలోని కొడిగెనహళ్లి పంచాయతీ పరిధిలోని పెద్దిరెడ్డిపల్లి మంచం పట్టింది. గ్రామంలోని పలువురు గురువారం అస్వస్థతకు గురయ్యారు. గ్రామంలోనే వైద్య శిబిరం ఏర్పాటు చేసి బాధితులకు చికిత్సలు అందిస్తోంది.

ఆహారం, నీరు కలుషితం..

మంగళవారం పెద్దిరెడ్డిపల్లి, బిందూనగర్‌, దామోదర్‌ కాలనీ, మారుతీనగర్‌ ప్రాంతాల్లో ముత్యాలమ్మ జాతర సందర్భంగా అమ్మవారికి జ్యోతుల సమర్పణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఆయా గ్రామాల వారు బంధువులు, మిత్రులను ఆహ్వానించడంతో గ్రామాలన్నీ జనంతో నిండిపోయాయి. ఈ క్రమంలో ఆహారంతో పాటు నీరు కూడా కలుషితమైనట్లు తెలుస్తోంది. గురువారం ఉదయం నుంచి వాంతులు, విరోచనాలతో పలువురు అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలిసిన వెంటనే పరిగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు పెద్దిరెడ్డిపల్లి గ్రామానికి వెళ్లారు. ఇంటింటికీ తిరిగి బాధితులతో మాట్లాడి చికిత్సలు అందించారు. డీఎంహెచ్‌ఓ ఫైరోజాబేగం కూడా గ్రామానికి వెళ్లి మూడు రోజులుగా నిర్వహిస్తున్న వైద్య శిబిరాన్ని పరిశీలించారు. కలుషిత ఆహారం తిన్న బాధితుల పరిస్థితిపై మెడికల్‌ ఆఫీసర్లు స్వరూపరెడ్డి, సురేష్‌తో ఆరాతీశారు. ఈ సందర్భంగా గ్రామంలో పారిశుధ్యంపై పంచాయతీ అధికారులతో పాటూ క్షేత్ర స్థాయి సిబ్బందితో సమీక్షించారు. కాగా వాంతులు, విరేచనాల బాధితులకు ఇబ్బంది లేదని, తగిన వైద్య సేవలను అందిస్తున్నామన్నారు. అనంతరం గ్రామంలోని మురుగుకాల్వల్లో బ్లీచింగ్‌ పౌడర్‌ను చల్లించారు.

పీహెచ్‌సీ తనిఖీ

పరిగి ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి ఫైరోజాబేగం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మందుల నిల్వలతో పాటూ నిత్యం ఓపీ నమోదు శాతంపై ఆరా తీశారు. పలు రికార్డులను పరిశీలించారు.

వాంతులు, విరేచనాలతో పలువురికి అస్వస్థత

జిల్లా వైద్యాధికారి పర్యటన

Advertisement
 
Advertisement
Advertisement