గోరంట్ల: చోరీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగలను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. గోరంట్ల పీఎస్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను సీఐ శేఖర్ వెల్లడించారు. 2024, ఏప్రిల్ 2న గోరంట్లలోని చైతన్య పాఠశాల బయట నిలిపిన స్కూటర్ డిక్కీ ధ్వంసం చేసి అందులోని రూ. 5.90 లక్షలను దుండగులు అపహరించారు. అలాగే 2025, జూలై 14న గోరంట్లలోని వాసవి ఫంక్షన్ హాల్ ఎదుట నిలిపిన కారు అద్దాలు ధ్వంసం చేసి అందులోని రూ.7 లక్షలను ఎత్తుకెళ్లారు. ఈ రెండు ఘటనలపై అప్పట్లో బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసిన పోలీసులు పక్కా ఆధారాలతో అనకాపల్లి జిల్లా కె.కొత్తపాటు మండలం గొట్లం గ్రామానికి చెందిన ఎరికల రావుల ఆనంద్, ఇదే జిల్లా దేవరపల్లి మండలం కొత్తూరు ముత్యాలమ్మ పాళ్యం గ్రామానికి చెందిన కోరుకొండ త్రిమూర్తులు, విజయనగరం జిల్లా కొత్తవలస గ్రామానికి చెందిన గుమ్మడి సురేష్, ఇదే జిల్లా కొత్తవలస మండలం గొల్లల పాళ్యం నివాసి నంబారు సుధీర్‌ని గురువారం అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.10 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. వ్యసనాలకు బానిసలుగా మారిన వీరు ఏపీ వ్యాప్తంగా పలు జిల్లాలో చోరీలకు పాల్పడి జైలుకు వెళ్లారని, అక్కడి నుంచి విడుదలైన అనంతరం గోరంట్లకు చేరుకుని చోరీలు కొనసాగిస్తూ వచ్చారని పోలీసులు వివరించారు. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.
కారు ఢీకొని
యువకుడి మృతి
లేపాక్షి: కారు ఢీకొన్న ఘటనలో ఓ ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... హిందూపురం పట్టణానికి చెందిన శేఖర్ (27)కు భార్య మాధవి, మూడేళ్ల వయసున్న కుమారుడు ఉన్నారు. బేల్దారి పనులతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి హిందూపురంలో పని ముగించుకుని ద్విక్రవాహనంపై లేపాక్షి మండలం కొండూరుకు బయలుదేరిన శేఖర్... చోళసముద్రంలోని హెరిటేజ్ వద్దకు చేరుకోగానే ఎదురుగా దూసుకొచ్చిన కారు ఢీకొంది. ఈ ఘటనతో రోడ్డుపై పడిన శేఖర్ తలకు తీవ్ర గాయమై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అటుగా వెళుతున్న వారు గుర్తించి సమాచారం ఇవ్వడంతో 108 సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించారు. అప్పటికే మృతి చెందినట్లుగా నిర్ధారించడంతో పోలీసులు మృతదేహాన్ని హిందూపురం ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.


