గ్రాసం కరువు.. పోషణ బరువు | - | Sakshi
Sakshi News home page

గ్రాసం కరువు.. పోషణ బరువు

May 7 2026 9:56 AM | Updated on May 7 2026 9:56 AM

కదిరి: కరువు మేఘం కమ్ముకోవడంతో జిల్లాలో పశుగ్రాసం కరువైంది. మండు వేసవిలో భానుడి ఉగ్రరూపంతో పచ్చని మొక్కలన్నీ ఎండిపోయాయి. మరోవైపు వరి, వేరుశనగ కోతలకు యంత్రాల వినియోగం, వాతావరణ మార్పులు, వర్షాభావంతో బోరు బావుల్లో నీరు అడుగంటి పోవడంతో సాగు భూమి తగ్గిపోవడం..ఇలా పలు కారణాలతో పశువులకు గ్రాసం కరువైంది. పచ్చగడ్డి, నీటి లభ్యత లేకపోవడంతో పశువులు బక్కచిక్కి పోయాయి. ఇతర ప్రాంతాల నుంచి గడ్డి తీసుకువచ్చేందుకు ప్రయత్నించినా ధరలు ఆకాశంలో ఉండటంతో పాడిరైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డారు. ఈ నేపథ్యంలోనే ఇష్టం లేకపోయినా వాటిని కబేళాలకు విక్రయిస్తున్నారు. దీంతో పశు సంపద కూడా బాగా తగ్గిపోతోంది.

ట్రాక్టర్‌ గడ్డి రూ.30 వేలుపైనే

మామూలు రోజుల్లో పశువులను అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి మేపేవారు. అయితే ప్రస్తుతం ఎక్కడా మేత దొరకడం లేదు. దీంతో మేతకు డిమాండ్‌ పెరిగి గ్రాసం ధరలు ఆకాశాన్నంటాయి. గతంలో రూ.10 వేలు ఉన్న ట్రాక్టర్‌ గడ్డి ధర ఇప్పుడు రూ.30 వేలకు చేరింది. అది కూడా స్థానికంగా మేత దొరక్కపోవడంతో ఇతర జిల్లాల నుంచి గడ్డిని ట్రాక్టర్లు, లారీలలో తెచ్చుకుంటున్నారు. వీధుల్లో తిరిగే పశువుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. మేత దొరక్క చెత్త, ప్లాస్టిక్‌ కవర్లు వంటివి తింటూ, మురుగునీరు తాగుతూ వ్యాధుల బారిన పడుతున్నాయి.

పాడిరైతుల దీనావస్థ

వ్యవసాయమే జీవనాధారమైన జిల్లాలో పాడిపశువుల సంఖ్య కూడా బాగానే ఉంది. ధర్మవరం డివిజన్‌లో 65,966 ఆవులు, ఎద్దులు, 28,009 బర్రెలు, 9,14,202 గొర్రెలు, 1,19,031 మేకలు ఉన్నాయి. అలాగే హిందూపురం డివిజన్‌లో 1,00,945 ఆవులు, ఎద్దులు, 29.611 గేదెలు, 6,34,832 గొర్రెలు, 1,15,923 మేకలు ఉన్నాయి. అదే విధంగా పెనుకొండ డివిజన్‌ పరిధిలో 1,14,325 పశువులు, 37,925 బర్రెలు, 10,80,253 గొర్రెలు, 2,37,138 మేకలు ఉన్నాయి. గత ప్రభుత్వాలు పాడిపశువుల పెంపకం చేపట్టే రైతులకు ప్రోత్సాహకాలు అందించి పాడిపశువుల సంఖ్య పెరుగుదలకు కృషి చేశాయి. అలాగే గ్రాసం కొరత ఏర్పడకుండా తగు చర్యలు చేపట్టేవి. కానీ చంద్రబాబు ప్రభుత్వానికి మూగ జీవాల వేదన ఏమాత్రమూ పట్టలేదు. రైతులకు కేవలం గడ్డి విత్తనాల పంపిణీతో చేతులు దులుపుకుంటోంది.

రాయితీ ఏదీ?

గ్రాసం సాగుచేసుకునే పశుపోషకులకు రాయితీ ఇస్తామని చంద్రబాబు ప్రభుత్వం గొప్పగా హామీలిచ్చింది. 10 సెంట్ల భూమిలో పశుగ్రాసం సాగు చేసిన రైతులకు కూలీల ఖర్చు, సామగ్రితో కలిపి రూ.6,599, అలాగే 20 సెంట్లలో సాగుచేస్తే రూ.13,197, ఇక 30 సెంట్లలో సాగుచేసిన వారికి రూ.19,795, 40 సెంట్లలో సాగుచేస్తే రూ.26,394, అర ఎకరం(50 సెంట్లు)లో సాగు చేస్తే రూ.32,992 చొప్పున పశుపోషకులకు రాయితీ ఇస్తామని సర్కార్‌ చెప్పింది. కానీ జిల్లాలో ఈసారి 325 మంది రైతులు గ్రాసం సాగుచేసినప్పటికీ వారికి ఇంత వరకూ ఒక్క రూపాయి కూడా ఇచ్చిన పాపాన పోలేదు. పశుగ్రాసం పథకం ఉందనే విషయం జిల్లాలో 90 శాతం మంది రైతులకు తెలియదని ఆ శాఖ అధికారే ఒకరు చెప్పడం గమనార్హం.

పాడి పరిశ్రమపై కరువు పోటు

మేతలేక బక్కచిక్కుతున్న పశువులు

రెండేళ్లలో మూడు రెట్లు పెరిగిన గ్రాసం ధర

పాడిపశువులను పస్తుపెట్టలేక అమ్ముకుంటున్న పోషకులు

గడ్డి ధర పెరిగింది

నాకు నాలుగు గేదెలున్నాయి. గతంలో మేతకు పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. ప్రసుత్తం బయట ఎక్కడా పచ్చగడ్డి లేదు. దీంతో దానాతో పాటు గడ్డి ధర విపరీతంగా పెరిగింది. అంత డబ్బు వెచ్చించలేక పశువులను పస్తు పెట్టలేక చాలా మంది అమ్ముకున్నారు. నాకు పశువులను అమ్మేందుకు మనస్సురాక అలాగే ఉంచుకున్నా. ప్రభుత్వం పాడి రైతులను ఆదుకోకపోతే భవిష్యత్‌లో పశువులు కనబడవు.

– ఆంజనేయులు, పాడి రైతు, కదిరి

గ్రాసం కొరత ఉంది

గ్రాసం కొరతకు చాలా కారణాలున్నాయి. యంత్రాలతో వరికోతలు, కూరగాయలు, పండ్లు, పూల తోటల సాగు కారణంగా గడ్డి కొరత నెలకొంది. గడ్డి విత్తనాలు పంపిణీ చేశాం. గడ్డి కొరతపై నివేదికలు తెప్పించుకుని ప్రభుత్వానికి నివేదిస్తాం.

– శుభదాస్‌, జేడీ, పశుసంవర్ధక శాఖ

Advertisement
 
Advertisement
Advertisement