అధ్వాన ఆస్పత్రులు! | - | Sakshi
Sakshi News home page

అధ్వాన ఆస్పత్రులు!

May 7 2026 9:56 AM | Updated on May 7 2026 9:56 AM

సాక్షి, పుట్టపర్తి: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సర్కారు ఆస్పత్రుల్లో వైద్య సేవలు అటకెక్కాయి. ఓపీ విభాగం దగ్గర నుంచి మార్చురీ గది వరకు సేవలు సరిగా అందడం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్యుల సంఖ్య తక్కువగా ఉండటంతో పాటు మందుల కొరత పట్టిపీడిస్తుండటంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా పరిధిలో హిందూపురం, మడకశిర, పెనుకొండ, ధర్మవరం, కదిరి నియోజకవర్గ కేంద్రాల్లోని ప్రభుత్వాస్పత్రులను ‘సాక్షి’ విజిట్‌ చేయగా రోగుల అవస్థలు, డాక్టర్ల నిర్లక్ష్యం, వసతుల లేమి, మందుల కొరత స్పష్టంగా కనిపించాయి.

చిన్న పిల్లల వార్డులో ఉక్కపోత

హిందూపురంలోని జిల్లా ఆస్పత్రిలో రోగులకు అరకొరగా వైద్య సేవలు అందుతున్నాయి. సాయంత్రం 4 గంటల వరకు ఓపీ విభాగంలో చీటీలు ఇస్తున్నా... రోగులకు వైద్యం చేసేందుకు ఆస్పత్రిలో డాక్టర్లు ఉండటం లేదు. గైనిక్‌ వార్డులో ఇద్దరు డాక్టర్లు మాత్రమే ఉండటంతో అత్యవసర సమయాల్లో ఇతర ఆస్పత్రులకు వెళ్లాలని రోగులకు సూచిస్తున్నారు. మాతాశిశు భవనం పైభాగంలో అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో కాన్పుల వార్డు, చిన్న పిల్లల వార్డులో ఏసీలు పని చేయడం లేదు. ఎండాకాలం కావడంతో చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఆస్పత్రిలో రక్త పరీక్షలకు ఎక్కువ సమయం పడుతోందని రోగులు చెబుతున్నారు. డయాలసిస్‌ వార్డులో జనరేటర్‌ లేకపోవడంతో కరెంట్‌ పోతే రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మందకొడిగా నిర్మాణాలు

మడకశిర పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి అభివృద్ధికి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రూ.20 కోట్లు కేటాయించారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పనులన్నీ అటకెక్కాయి. రెండేళ్లు గడిచినా సగం కూడా పనులు పూర్తి కాలేదు. దీంతో రోగులు, సిబ్బంది, డాక్టర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళల్లో సమయానికి రోగులకు వైద్య సేవలు అందడం లేదని, రాత్రి పూట డాక్టర్లు, సిబ్బంది విధుల్లో అలసత్వం వహిస్తున్నారని రోగులు చెబుతున్నారు.

పెనుకొండలో సేవలు అధ్వానం

మంత్రి సవిత ప్రాతినిథ్యం వహిస్తోన్న పెనుకొండ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి రోజుకు సగటున 500 మంది రోగులు వస్తుంటారు. అయితే రోగులకు కూర్చునేందుకు వసతి లేదు. డాక్టర్ల కొరత ఉంది. ఆక్సిజన్‌ ప్లాంట్‌ పని చేయడం లేదు. ట్రామా కేర్‌ నిర్వహణలో లేదు. మార్చురీ గది అధ్వానంగా ఉంది. హాస్పిటల్‌ ఆవరణలో ద్విచక్ర వాహనాలు ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్‌ చేస్తుండటంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు.

గర్భిణుల నుంచి డబ్బులు డిమాండ్‌

కదిరి పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ప్రసవం కోసం వచ్చిన గర్భిణుల నుంచి డబ్బులు డిమాండ్‌ చేస్తున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. అలాగే డయాలసిస్‌ రోగులకు సకాలంలో సేవలు అందడం లేదని చెబుతున్నారు. మందులు కూడా అందజేయడం లేదని వాపోతున్నారు.

ఆక్సిజన్‌ ఉన్నా .. కనెక్షన్‌ లేదు

ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న ధర్మవరం పట్టణంలోని ఏరియా ఆస్పత్రిలో ఆక్సిజన్‌ అందుబాటులో ఉన్నా... సిలిండర్లకు కనెక్షన్‌ ఇవ్వలేదు. దీంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. కేవలం ఆపరేషన్‌ థియేటర్‌లో మాత్రమే ఆక్సిజన్‌ అందుబాటులో ఉంచారు. మిగతా వార్డుల్లోని రోగులకు ఆక్సిజన్‌ అవసరమైతే అంతే సంగతి.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతుల లేమితో రోగుల అవస్థలు

తీసికట్టుగా సేవలు.. మందుల కొరత

ప్రముఖ విభాగాల్లో డాక్టర్‌ పోస్టుల ఖాళీ

వెంటాడుతున్న వసతుల లేమి

Advertisement
 
Advertisement
Advertisement