ఆదర్శం.. ఈశ్వరమ్మ జీవితం | - | Sakshi
Sakshi News home page

ఆదర్శం.. ఈశ్వరమ్మ జీవితం

May 7 2026 9:56 AM | Updated on May 7 2026 9:56 AM

ప్రశాంతి నిలయం: సత్యసాయికి జన్మనిచ్చిన ఈశ్వరమ్మ అవనికే ఆదర్శమూర్తి అని సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్‌ రాజు అన్నారు. బుధవారం ఈశ్వరమ్మ వర్ధంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత సాయికుల్వంత్‌ సభా మందిరంలో బాల వికాస్‌ చిన్నారులు భక్తి గీతాలు ఆలపించారు. ఈశ్వరమ్మను, సత్యసాయిని కీర్తిస్తూ చక్కటి గీతాలతో ఆకట్టుకున్నారు. అనంతరం స్వయం ఉపాధి కల్పన కోసం పలువురు మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. ఆ తర్వాత సత్యసాయి పూర్వ ప్రసంగాల్లో మాతృమూర్తి ఈశ్వరమ్మ గొప్పతనాన్ని వివరించే సందేశాన్ని డిజిటల్‌ స్క్రీన్ల మీద భక్తులకు వినిపించారు. ఆ తర్వాత పట్టణంలోని సమాధి రోడ్డులోని సత్యసాయి మాతృమూర్తి ఈశ్వరమ్మ, తండ్రి పెదవెంకమరాజు సమాధుల వద్ద సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్‌ రాజు కుటుంబ సభ్యులు, పలువురు ట్రస్ట్‌ సభ్యులు, సత్యసాయి విద్యాసంస్థల సిబ్బంది, భక్తులు పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యసాయి విద్యార్థులు, భక్తులు సంగీత విభావరి నిర్వహించారు. హాజరైన భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. పుట్టపర్తి వీధుల్లో పూలు, కూరగాయలు, పండ్లు విక్రయించే వ్యాపారులకు ఎండ వేడిమి నుంచి తట్టుకునే విధంగా గొడుగులను పంపిణీ చేశారు. సాయంత్రం పలువురు బాలవికాస్‌ విద్యార్థులు ఈశ్వరమ్మ ఆదర్శ విలువల గురించి ప్రసంగించారు. అనంతరం సంగీత విద్వాంసురాలు ఎల్‌. కీర్తన బృందం సంగీత విభావరి నిర్వహించి భక్తులను ఆకట్టుకున్నారు.

వర్ధంతి వేడుకల్లో ఆర్‌జే రత్నాకర్‌ రాజు

సేవా కార్యక్రమాలతో స్ఫూర్తి చాటిన వైనం

Advertisement
 
Advertisement
Advertisement