హిందూపురం/ ధర్మవరం అర్బన్: కక్షిదారులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యమని, ఇందుకోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సైతం అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసాగిల్ పేర్కొన్నారు. బుధవారం జిల్లాలోని ధర్మవరంలో రెండు అడిషినల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులు, హిందూపురంలో ఒక సివిల్ జడ్జి న్యాయస్థానాలను బుధవారం ఆమె అమరావతి నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. న్యాయమూర్తులు భానుమతి, సురేష్‌రెడ్డి, చల్లా గుణరంజన్ వర్చువల్‌గా పాల్గొన్నారు. అనంతరం హిందూపురం, ధర్మవరం కోర్టులను ఉమ్మడి అనంతపురం జిల్లా న్యాయమూర్తి భీమారావు రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలతో పాటు సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం జిల్లా న్యాయమూర్తి భీమారావు అదనపు కోర్టుల ఏర్పాటు వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. కక్షిదారులు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో కేసులను సత్వరం పరిష్కరించాలని అదనపు న్యాయస్థానాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. న్యాయమూర్తులు సైతం కేసులను సత్వరం పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని సైతం ఎప్పటికప్పుడు ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా న్యాయమూర్తిని ధర్మవరం, హిందూపురంలో స్థానిక బార్ అసోసియేషన్ల నేతలు సన్మానించారు. హిందూపురం నూతన కోర్టు విధులను ఇన్‌చార్జి న్యాయమూర్తి లలితా లక్ష్మీ హారిక ప్రారంభించారు. న్యాయమూర్తులు హేమలత, రమణయ్య, రమాదేవి పాల్గొన్నారు. ధర్మవరంలో జరిగిన కార్యక్రమంలో ఎస్పీ సతీష్‌కుమార్, సివిల్ జడ్జి వెంకటేశ్వర్లు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి నందిని, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి వెంకట హరీష్ పాల్గొన్నారు.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసాగిల్
వర్చువల్‌గా జిల్లాలో మూడు న్యాయస్థానాల ప్రారంభం


