● అధికారులకు జేసీ మౌర్య భరద్వాజ్ ఆదేశం
మడకశిర రూరల్: జనగణనను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, దీన్ని గుర్తించి సర్వే సిబ్బంది కూడా జనగణనను పక్కాగా చేయాలని జేసీ మౌర్య భరద్వాజ్ తెలిపారు. బుధవారం ఆయన మండల పరిధిలోని కదిరేపల్లి గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. సచివాలయం ద్వారా ప్రజలకు అందించే సేవలు, జనగణన సర్వే వివరాలను అడిగి తెలుసుకున్నారు. జనగణన సర్వేలో వెనుకబడి ఉన్నారని, వెంటనే సర్వే వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ సేవలు సకాలంలో ప్రజలకు అందించాలన్నారు. జేసీ వెంట ఆర్డీఓ ఆనంద్‌కుమార్, తహసీల్దార్ మైనుద్దీన్, ఎంపీడీఓ సోనిబాయి, ఆర్‌ఐ సోమశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
రాగుల కొనుగోలు కేంద్రం ప్రారంభం
గుడిబండ: జిల్లాలోని రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులు పండించిన రాగులను మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ తెలిపారు. బుధవారం ఆయన మండల పరిధిలోని మోరబాగల్ గ్రామంలో రాగుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ... క్వింటా రాగులను రూ. 4,886 మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నామని, రాగులు పండించిన రైతులందరూ రైతు సేవా కేంద్రాల్లో వివరాలను అందించాలన్నారు. ఒక రైతు నుంచి ఎకరాకు 13.50 క్వింటాళ్ల చొప్పున కొనుగోలు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ ఆనంద్‌కుమార్, ఏడీఏ కృష్ణమీనన్, సివిల్ సప్లయీస్ డీఎం రాజు, తహసీల్దార్ కళ్యాణ చక్రవర్తి, ఎంపీడీఓ రామారావు, ఏఓ వీరనరేష్ పాల్గొన్నారు.


